పవన్ కల్యాణ్ కు అమిత్ షా ట్వీట్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలుగులో ట్వీట్ చేశారు. శనివారం అమిత్ షా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పవన్ కల్యాణ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ హిందీలో చేస్తూ పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేసింది. దేశం ఐక్యంగా ఉండటం కోసం, ఆంతరంగికంగా కూడా సురక్షితంగా ఉండటం కోసం అమిత్ షా నిరంతరం శ్రమిస్తున్నారని పవన్ కల్యాణ్ కొనియాడారు.
నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు. @PawanKalyan https://t.co/yCD69lrtM5
— Amit Shah (@AmitShah) October 22, 2022
అమిత్ షా ఈ ట్వీట్ కు బదులిచ్చారు. 'నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు' అంటూ తెలుగులో ట్వీట్ చేస్తూ జనసేనానిని ట్యాగ్ చేశారు. ఇటీవల విశాఖపట్నంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో... మీరు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, అమిత్ షాలను కలుస్తారా? అని మీడియా పవన్ కల్యాణ్ ను ప్రశ్నించింది. అయితే తాను వారిని కలవబోనని, ఇక్కడే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. బీజేపీతో మొదటి నుంచి పొత్తున్నప్పటికీ అనుకున్నంతస్థాయిలో ముందుకు వెళ్లలేకపోయామన్నారు.

రోడ్ మ్యాప్ అడుగుతున్నప్పటికీ పార్టీ నేతలు ఇవ్వడంలేదంటూ ఆ పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సోము వీర్రాజు ఢిల్లీ పెద్దలతో మాట్లాడారని, పవన్ తో వారు కూడా మాట్లాడారని, వెంటనే ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ ఫేక్ న్యూస్ గా మిగిలాయి. పవన్ కు ఎవరూ ఫోన్ చేయలేదని, ఎటువంటి ఫోన్ కాల్ రాలేదని జనసేన ప్రతినిధులు తెలిపారు.
జనసేనాని భారతీయ జనతాపార్టీతో కలిసి వెళ్లే అవకాశాలు లేవని భావిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల తర్వాత ఇరుపార్టీల మధ్య దూరం పెరిగింది. ఎవరికి వారు ఏపీలో సొంతంగా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు పర్యటనల్లో జనసేన జెండాలు కూడా కనపడుతున్నాయి.












Click it and Unblock the Notifications