ముందస్తు ఎన్నికలు ఖాయమా, భారీ ప్రణాళిక - కేంద్రం క్లారిటీ..!!
లోక్ సభకు ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. జమిలి ఎన్నికల నిర్వహణగా కేంద్రం కసరత్తు చేస్తోంది. కేంద్రం ముందస్తుకు వెళ్లే ఆలోచన చేస్తోందని..లోక్ సభతో పాటుగా రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయం ఉంది. ఈ సమయంలో అసలు కేంద్రం ఆలోచనలు ఏంటనేది మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టత ఇచ్చారు.
ముందస్తు ఖాయమంటూ:ఏపీలో ముందస్తు ఖాయమని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల తరువాత లోక్ సభకు ముందస్తుకు వెళ్తుందని..దీంతో, ఏపీలోనూ ముందస్తు తప్పదనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో జమిలికి ఆమోదం లభిస్తే తెలంగాణలో ఎన్నికలు వాయిదా పడతాయనే చర్చ సాగింది. ఈ సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఏదీ కేంద్రానికి లేదని మంత్రి అనురాగ్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చారు. ప్రధాని మోదీ పదవీ కాలంలో చివరి రోజు వరకూ దేశానికి సేవ చేయాలనుకుంటున్నారని తెలిపారు. అలాగే త్వరలో కొన్ని రాష్ట్రాలకు జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసి, సార్వత్రిక ఎన్నికలతో పాటు నిర్వహించే యోచన కూడా లేదన్నారు.

గడువు ప్రకారమే జరుగుతాయా:ఒకే దేశం, ఒకే ఎన్నికపై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, దీనికి సంబంధించి తుది నిబంధనలు ఖరారు చేసేముందు కమిటీ అన్ని పక్షాలతో విస్తృతంగా చర్చలు జరుపుతుందని వివరించారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన ఎనిమిది మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీలో లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌధరి కూడా ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పారు.
ఈ కమిటీలో ప్రతిపక్షాలకు కూడా చోటు కల్పించడం మోదీ ప్రభుత్వ విశాల హృదయానికి నిదర్శనమని అనురాగ్ చెప్పుకొచ్చారు. ఈ నెల 18 నుంచి 22 వరకూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధం కావడంపై విమర్శలు చేయడం తగదన్నారు. ఈ సమావేశాల కోసం కేంద్రం భారీ ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు.

పార్లమెంట్ సమావేశాలపై ఉత్కంఠ:అయితే సమావేశాల అజెండాను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ అజెండాను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తగిన సమయంలో వివరిస్తారని ఠాకూర్ పేర్కొన్నారు. ఇటు విపక్షాలు మాత్రం కేంద్రం ఇప్పటికే జమిలి పై నిర్ణయం తీసుకొని..కమిటీ ఏర్పాటు చేసిందని ఆరోపిస్తున్నాయి.
జమిలీ ఎన్నికలు నిర్వహించే అంశంపై పరిశీలన జరిపి సిఫారసులు చేసేందుకు కేంద్రం నియమించిన కమిటీకి నేతృత్వం వహిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో న్యాయశాఖ ఉన్నతాధికారులు ఆదివారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చినా.. పార్లమెంట్ లో కేంద్రం ఏ బిల్లులు ప్రతిపాదిస్దుందీ.. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications