ఆత్మరక్షణలో చిరంజీవి, సర్దుబాటు యత్నం?
హైదరాబాద్: తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రి చిరంజీవి ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నారు. తన వర్గానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాస రావుతో పాటు కొంత మంది శాసనసభ్యులు పార్టీ మారడానికి సిద్ధపడడంతో ఆయన అనివార్యంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీ నుంచి విలీనం కారణంగా తనతో పాటు కాంగ్రెసు పార్టీలోకి వచ్చినవారిని కాపాడుకోవడానికి ఆయన మొదటి నుంచీ ప్రయత్నాలు చేస్తున్నారు.
గంటా శ్రీనివాస రావుతో పాటు మరో నలుగురు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు, అందుకు ముహూర్తం కూడా ఖరారైనట్లు, ఈ నెల 17వ తేదీన వారు తెలుగుదేశం పార్టీలే చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. తన వర్గానికి చెందినవారు పార్టీ మారితే తన ప్రాబల్యం దెబ్బ తింటుందనే ఆందోళనకు చిరంజీవి గురవుతున్నట్లు సమాచారం.

గంటా శ్రీనివాస రావు మొదటి నుంచీ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చిరంజీవి చెబుతున్నా కూడా గంటా శ్రీనివాస రావు పట్టించుకోకుండా సమైక్యవాదం వినిపిస్తూ వచ్చారు. ఒక రకంగా గంటా శ్రీనివాస రావు తన విధేయతను మార్చుకున్నారని కూడా అంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి విధేయుడిగా మారినట్లు చెబుతున్నారు. అయినా, ప్రస్తుత స్థితిలో కాంగ్రెసులో ఉండడానికి కూడా ఆయన ఇష్టంగా లేరని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీలో చేరాలని ఆయన చాలా కాలం క్రితమే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే అందరి కన్నా గట్టిగా సమైక్యవాదాన్ని వినిపిస్తూ వచ్చారని అంటున్నారు. అయితే, తన వర్గానికి చెందిన ఏ కొద్ది మంది శాసనసభ్యులు పార్టీని వీడినా అది తనకు నష్టం కలిగిస్తుందనే అభిప్రాయంతో చిరంజీవి ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెసు పార్టీ విభజనకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీని పునరుద్ధరించాలని కూడా చిరంజీవిపై ఒత్తిడి వచ్చిందని అంటున్నారు. అయితే, చిరంజీవి అందుకు సిద్ధంగా లేరని సమాచారం. కాంగ్రెసును వీడవద్దని చిరంజీవి చెప్పారని ఆయన వర్గీయులంటున్నారు. అయితే, తాము కాంగ్రెసు పార్టీలో ఉండలేమని కొంత మంది చిరంజీవికి గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది. విషయం తేలకపోవడంతో ఈ నెల 23వ తేదీలోగా మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభ అభిప్రాయం చెప్పడానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనవరి 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు. జనవరి 23వ తేదీ తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు భారీగానే మారే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications