Vizag Steel Plant: ప్రైవేటీకరణకే కేంద్రం మొగ్గు?: కుమారస్వామి రాక
ఏపీకి తలమానికంలా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కూడా చర్చనీయాంశమైన ప్రస్తుత పరిస్థితుల్లో- కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది.
గతంలో ఆందోళనలు..
విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని వందశాతం మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలను గానీ, ఆందోళనలను గానీ కేంద్ర ప్రభుత్వం బేఖాతర్ చేసింది.

ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్..
అయిదు దశాబ్దాలకు పైగా కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటూ వస్తోన్న స్టీల్ ప్లాంట్ ఇది. ప్రతి సంవత్సరం 7.3 మిలియన్ టన్నుల మేర ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉంది. దేశంలో మొట్టమొదటి సారిగా ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు పేరుతో దశాబ్దాల కిందటే రాష్ట్రంలో ఉద్యమాలు సాగాయి.
వందశాతం..
అలాంటి ఘన చరిత్ర ఉన్న ఈ ప్లాంట్‌ను ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాల మీద ఏర్పాటైన కేబినెట్ కమిటీ.. గతంలోనే దీన్ని విక్రయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వందశాతం మేర పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చంటూ సూచనప్రాయంగా తెలియజేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖలకు నివేదికలను అందజేసింది.

కేంద్రం రెడీ..
కేబినెట్ కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం- మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీలో సబ్సిడయిరీస్ లేదా జాయింట్ వెంచర్స్ ఉంటే వాటిని కూడా వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది. 2003లో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ బిడ్స్‌ను సైతం ఆహ్వానించింది కేంద్ర ప్రభుత్వం. ప్రైవేటీకరణ చర్యలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అడ్డుకున్నారు. ఫలితంగా ప్రైవేటీకరణ ముందుకు సాగలేదు.
కుమారస్వామి రాక..
ఇందులో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి.. ఈ సాయంత్రం విశాఖపట్నానికి రానున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌస్‌లో బస చేయనున్నారు. గురువారం విశాఖ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించనున్నారు. సంబంధిత అధికారులు ఇందులో పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications