వైఎస్ జగన్‌పై అమెరికా కోర్టులో కేసు వేసిన లోకేష్: సమన్లు జారీ - టాయ్‌లెట్ పేపర్..!!
అమరావతి: ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అమెరికా న్యాయస్థానంలో దావా ఫైల్ అయింది. ఆయనతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, దేశీయ పారిశ్రామికదిగ్గజం, అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత గౌతమ్ అదానిపైనా దావా వేశారు. మరి కొందరు ప్రముఖల పేర్లనూ ఇందులో పొందుపరిచారు. దావా ఫైల్ అయిన నేపథ్యంలో అమెరికా న్యాయస్థానం వారందరికీ సమన్లను జారీ చేసింది.

కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టులో..
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రతి సంవత్సరం ప్రపంచ ఆర్థిక సదస్సును నిర్వహించే వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఛైర్మన్ డాక్టర్ క్లాస్ ష్క్వాబ్ పేరు కూడా ఇందులో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఏడాది 24వ తేదీన యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో కేసు నమోదైంది. జూన్ 22వ తేదీన కొలంబియా కోర్ట్ వారికి సమన్లు జారీ చేసింది. కిందటి నెల 4వ తేదీన వారందరికీ సమన్లు అందాయి. ఆగస్టు 2వ తేదీ నాడే డాక్టర్ క్లాస్ ష్క్వాబ్ సమన్లను అందుకున్నారు.

పెగాసస్ సహా..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ కుంభకోణం, అవినీతి వంటి అంశాలను కారణాలుగా చూపుతూ ఈ దావా వేశారు. వర్జీనియా స్టేట్‌లోని రిచ్‌మండ్‌లో నివసించే డాక్టర్ లోకేష్ ఉయ్యూరు.. ఈ మేరకు ప్రధాని మోదీ, సీఎం జగన్, అదాని సహా ఇతర ప్రముఖులపై కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. రిచ్‌మండ్‌లో ఆయన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌గా పని చేస్తోన్నారు. ఎలాంటి సాక్ష్యాధారాలను ఆయన చూపలేదని, అలాంటి వాటినేవీ తన పిటీషన్‌కు జత చేయలేదని తెలుస్తోంది.

సాక్ష్యాధారాల్లేకుండా..
పెగాసస్ స్పైవేర్ కుంభకోణం, అవినీతిపై సాక్ష్యాధారాలను సమర్పించడానికి కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టు డాక్టర్ లోకేష్ ఉయ్యూరుకు ఆగస్టు 19వ తేదీ వరకూ సమయం ఇచ్చింది. ఆయన వాటినేవీ సకాలంలో సమర్పించలేకపోయారు. ఈ కేసులో న్యూయార్క్‌కు చెందిన ఇండియన్-అమెరికన్ అటార్నీ రవి బాత్రా తన వాదనలను వినిపించారు. డాక్టర్ లోకేష్ ఉయ్యూరు వేసిన దావాను తప్పుపట్టారు.

మూడు నెలలు గడువు ఇచ్చినా..
సాక్ష్యాధారాలను సమర్పించాలంటూ మూడు నెలల పాటు గడువు ఇచ్చినప్పటికీ- ఆయన వాటిని అందజేయలేకపోయారని చెప్పారు. దీన్ని ఆయన డెడ్ ఆన్ అరైవల్ లా సూట్‌గా అభివర్ణించారు. కోరినంత గడువు ఇచ్చినప్పటికీ- పెగాసస్ స్పైవేర్, అవినీతిపై సరైన సాక్ష్యాధారాలను డాక్టర్ లోకేష్ ఉయ్యూరు న్యాయస్థానానికి సమర్పించలేకపోయారని అన్నారు. తాను అందజేసిన 53 పేజీల పిటీషన్‌లో చేసినవన్నీ నిరాధార ఆరోపణలేననేది స్పష్టమైందని వ్యాఖ్యానించారు.

భారత్-అమెరికా సంబంధాలను దెబ్బతీయడానికే..
భారత్-అమెరికా మధ్య గల ఆర్థిక, దౌత్య, వాణిజ్యపరమైన సంబంధాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే డాక్టర్ లోకేష్ ఉయ్యూరు.. ఈ దావా వేసినట్లు భావించాల్సి వస్తోందని అటార్నీ రవి బాత్రా వ్యాఖ్యానించారు. ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా- వారి ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఈ చర్యకు పాల్పడినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. ఎక్స్‌ట్రా టెరిటోరియల్ అండ్ ఫారిన్ సావరిన్ ఇమ్యూనిటీ యాక్ట్‌కు భిన్నంగా ఈ దావా వేసినట్లు చెప్పారు.

టాయ్‌లెట్ పేపర్..
డాక్టర్ లోకేష్ ఉయ్యూరు తరఫున వాదించడానికి ఏ న్యాయవాది కూడా అంగీకరించకపోవడం- ఈ దావాకు ఉన్న ప్రాధాన్యత ఏమిటో స్పష్టం చేస్తోందని రవి బాత్రా చెప్పారు. దీన్నొక టాయ్‌లెట్ పేపర్ కంప్లైట్‌గా పేర్కొన్నారు. డెడ్ ఆన్ అరైవల్ లా సూట్‌గా అభివర్ణించారు. అవినీతి చోటు చేసుకుందంటూ ఆయన ఫిర్యాదు చేశారని, అది జరిగినట్టుగా నిర్ధారిస్తూ ఎలాంటి సాక్ష్యాధారాలను అందజేయలేకపోయారని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications