తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్ల విడుదల తేదీ ఇదే: తిరుమలకు రావొచ్చు కానీ..!!
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 70,457 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,152 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.16 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
16 కంపార్ట్‌మెంట్ల నిండా భక్తజనం..
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 16 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

తిరుమల ముస్తాబు..
కలియుగ వైకుంఠం తిరుమల.. వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది. జనవరి 10 నుండి 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
కీలక నిర్ణయాలు..
వైకుంఠ ఏకాదశిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే టీటీడీ కొన్ని నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులకు తిరుమలకు వెళ్లొచ్చు గానీ శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం వారికి లభించదు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దవుతాయి. వేదాశీర్వచనాలు కూడా రద్దయ్యాయి.
టికెట్ల విడుదల తేదీలు ఇవే..
ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు. 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
జనవరి 8న..
వైకుంఠ ఏకాదశి నాడు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి టీటీడీ అధికారులు ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఇందులో భాగంగా వైకుంఠ ఏకాదశికి సరిగ్గా రెండు రోజుల ముందు అంటే జనవరి 8వ తేదీన స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్‌డీ) టోకెన్లను విడుదల చేసే అవకాశం ఉంది.
కౌంటర్లు ఇవే..
తిరుపతిలో ఎంఆర్ పల్లి, జీవకోన, రామానాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కేంద్రాల్లో ఈఎస్ఎస్‌డీ టోకెన్లు జారీ అవుతాయి.
తిరుమలకు రావొచ్చు గానీ..
టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుంది. టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు గానీ దర్శనం లభించదు. టోకెన్లు లేదా టికెట్లు లేని భక్తులను క్యూ లైన్లలోకి అనుమతించరు. వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామున 4:45 నిమిషాలకు ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభమౌతాయి.












Click it and Unblock the Notifications