తిరుమల తిరుపతిల్లో కోలాహలం..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం నాడు 69,928 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 29,297 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.21 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 20 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

ఈ నెల 8వ తేది వరలక్ష్మీ వ్రతం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. లక్షమందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శిస్తారని అంచనా వేసింది. దీనికి అనుగుణంగా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ సందర్భంగా తిరుచానూరు ఆలయం పరిధిలో ప్రత్యేక క్యూ లైన్లు వేశారు. భక్తులకు అన్నప్రసాదం, శోభాయమానంగా విద్యుద్దీపాల అలంకరణలు, పుష్పాలంకరణ, పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. 8వ తేదీన ఉదయం 10 నుండి 12 గంటల వరకు ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు.
భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఆలయం మేరకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. దీన్ని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అదే రోజు సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై మాడ వీధుల్లో విహరిస్తారు. అశేష భక్తులను కరుణిస్తారు. ఈ శోభాయాత్రను కన్నుల పండువగా నిర్వహించనుంది టీటీడీ.
తిరుమల శ్రీవారి ఆలయంలో..
మరోవంక- తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. మంగళవారం శాస్త్రోక్తంగా ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు.
అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచసూక్తాలను పఠించారు. ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ట జరిగింది. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు.
సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు టీటీడీ అర్చకులు.
టీటీడీ ఆలయాల్లో సౌభాగ్యం..
మహిళా భక్తులకు 'సౌభాగ్యం' కార్యక్రమం ద్వారా అమ్మవారి అనుగ్రహం అందేలా చర్యలు జరుగుతున్నాయి. అదేవిధంగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో 51 టీటీడీ స్థానిక ఆలయాల్లో నిర్వహించే 'సౌభాగ్యం' కార్యక్రమం ద్వారా మహిళా భక్తులకు అక్షింతలు, పసుపు దారాలు, కుంకుమ, కంకణాలు, శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి పుస్తకం, గాజులు వంటి పవిత్ర సామగ్రిని పంపిణీ చేస్తారు.












Click it and Unblock the Notifications