కొడాలి నానిపై డీజీపీకి వర్ల రామయ్య లేఖ: గుడివాడలో ప్రత్యేక రాజ్యంగం : ఈ అంశాలపై విచారణ చేయాలి..!!
మంత్రి కొడాలి నాని లక్ష్యంగా టీడీపీ నేతలు మరోసారి గుడివాడలో క్యాసినో అంశం ప్రస్తావించారు. గుడివాడలో మంత్రి కొడాలి నాని అక్రమంగా అక్రమ క్యాసినో నిర్వహించారని.. మంత్రి అక్రమాస్తులు, దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాసారు. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. గుడివాడ నియోజకవర్గంను మంత్రి కొడాలి నాని తన గుప్పిట్లో పెట్టుకుని ప్రత్యేక చట్టం, రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రజలపైన మంత్రి కొడాలి నాని, అనుచరులు వేధింపులు తారాస్థాయికి చేరుకున్నాయని లేఖలో ఫిర్యాదు చేసారు.
గుడివాడలో కొడాలి నాని పీనల్ కోడ్, రాజ్యాంగం అమలులో ఉందని అందరూ అనుకుంటున్నారని వివరించారు. జనవరి 2022లో గుడివాడలో అక్రమంగా క్యాసినో నిర్వహిస్తున్నట్లు డీజీపీ కార్యాలయానికి అనేక లేఖల ద్వారా నివేదించామని వర్ల రామయ్య లేఖలో ప్రస్తావించారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. 2015లో లంకా విజయ్ మరణం వాస్తవానికి రైలు ప్రమాదంగా మార్చబడిన ఆత్మహత్య అంటూ ఆరోపించారు. అడపా బాబ్జీ మృతికి కొడాలి నాని వేధింపులే కారణమని అందరూ అనుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని చట్టాలకు అతీతుడు కాదని ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు నాని అక్రమాస్తులు, దౌర్జన్యాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు.

అక్రమ క్యాసినో నిర్వహణపై తీసుకున్న చర్యలతోపాటు నూజివీడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) నివేదికను కూడా బహిర్గతం చేయాలని డీజీపీని తన లేఖలో వర్ల రామయ్య కోరారు. క్యాసినో వ్యవహారం పైన సంక్రాంతి పండుగ తరువాత టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసారు. ఆ తరువాత టీడీపీ నిజనిర్దారణ కమిటీ సభ్యులు గుడివాడకు వెళ్లారు. అక్కడ వైసీపీ - టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తాను ఎక్కడా క్యాసినో నిర్వహించలేదని మంత్రి నాని తేల్చి చెప్పారు. అయితే, ఇప్పుడు మరోసారి టీడీపీ నేత నేరుగా డీజీపీకి లేఖ రాయటం ద్వారా.. దీని పైన మంత్రి ఏ రకంగా స్పందిస్తారనేది చూడాలి.












Click it and Unblock the Notifications