స్వర్ణరథంపై అమ్మవారు. నాలుగుమాడ వీధుల్లో కర్పూర హారతులు !
తిరుపతి/తిరుచానూరు: తిరుపతి సమీపంలోని ఎంతో ప్రసిద్ది చెందిన తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజు శుక్రవారం స్వర్ణరథం పై ఆశీనులైన అమ్మవారు భక్తులను సాక్షాత్కరించారు. ఆలయంలో శుక్రవారం ఉదయం వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీపద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని అర్చకులు స్వర్ణరథంపై ఆశీనురాలిని చేశారు.
భక్తులు తన్మయత్వంతో తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మావారి ఆలయం నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. అమ్మవారి భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తరువాత ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుపతి సమీపంలోని తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకుని వారి కష్టాలు తీరిపోవాలని వేడుకుంటారు. ఈ వేడుకల్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులతో పాటు టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగుతాయి.శుక్రవారం స్వర్ణరథం మీద ఊరేగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులుతీరారు.

వసంతోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం 2. 30 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 2. 30 నుండి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించనున్నారు.
వేసవి సెలవులతో తిరుమలకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు వెలుతున్నారు. తమిళనాడు, కర్ణాటక నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు చాలా మంది తిరుగు ప్రయాణంలో తిరుపతి సమీపంలోని తిరుచానూరులోని శ్రీ పద్మవాతి అమ్మవారిని దర్శించుకుని వెలుతుంటారు. తిరుపతి నుంచి తిరుచానూరుకు టీటీడీకి చెందిన ఉచిత బస్సు సర్వీసులు, ఆర్ టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications