పవన్ కల్యాణ్ కు ఛాలెంజ్ - ప్రమాణానికి సిద్దమా..!!
ఏపీ ఎన్నికల రాజకీయంలో సవాళ్ల పర్వం మొదలైంది. చంద్రబాబు, పవన్ లక్ష్యంగా వైసీపీ నేతలు ఛాలెంజ్ చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తుండటంతో అక్కడ జగన్ స్పెషల్ ఆపరేషన్ మొదలు పెట్టారు. స్థానిక టీడీపీ, జనసేన నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. పవన్ అక్కడ ఓడటం ఖాయమంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి పవన్ కు సవాల్ చేసారు. ప్రమాణానికి సిద్దమా అని ప్రశ్నించారు.
పవన్ ప్రమాణం చేస్తారా
ఏపీలో ఎన్నికల తరువాత జనసేన పార్టీని బీజేపీలో పవన్ విలీనం చేయబోతున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేసారు. శ్రీపాద వల్లభుడు మీద ప్రమాణం చేసి జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయడని చెప్పమనండి అంటూ సవాలు విసిరారు. పవన్ కళ్యాణ్ కు ఓటమి కొత్త కాదు అని పేర్కొన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు ఓట్లే రావు.. వంగా గీత మీద పవన్ కళ్యాణ్ గెలవడం అసాధ్యం అని చెప్పారు. పవన్ కళ్యాణ్ కు ఓటమి భయంతోనే భీమవరం, గాజువాక నియోజక వర్గాలను వదిలేసాడు అని ఆయన ఎద్దేవా చేశారు.

బీజేపీలో విలీనమే
పదేళ్లు పార్టీ నాయకుడుగా ఉండి బీజేపీ ముఖ్య నేతలు చెబితే ఎంపీ, ఎమ్మెల్యే గానీ పోటీ చేస్తానని పవన్ చెప్పటం హాస్యాస్పదంగా ఉందని వెల్లంపల్లి పేర్కొన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్, కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు. ఏపీలో 175కు 175 నియోజకవర్గాల్లో వైయస్ఆర్ సీపీ జెండా ఎగర వేస్తామని వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వైసీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా ఆరోపణలు చేసారు. ఒంటరిగా గెలిచే సత్తా లేక ప్రతిసారి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని మండిపడ్డారు.
ఆత్మగౌరవం తాకట్టు
దేశంలోనే అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం ముందుందని చెప్పారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి గద్దె రామ్మోహన్ విఫలమయ్యారన్నారు. తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో దేవినేని అవినాష్ తన దైన ముద్ర వేసుకున్నారన్నారు. మోదీ భజన చేసేందుకు టీడీపీ జనసేన నేతలు సిద్ధమయ్యారని ఎద్దేవా చేసారు. ఎన్టీఆర్ ఆత్మ గౌరవాన్ని బీజేపీ పెద్దలకు చంద్రబాబు తాకట్టు పెట్టారని విమర్శించారు. పిఠాపురంలో ఓడిపోవటాని పవన్ సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే పవన్ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ,పవన్ కు ప్రజాగళం సభలో మోదీని శాలువా తో సత్కరించడం చేతకాలేదని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల తరువాత టీడీపీ జనసేన పార్టీలు బీజేపీలో విలీనం అయిపోతాయని కేశినేని నాని జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications