'వెంకయ్యది విశిష్ఠ వ్యక్తిత్వం': 'పదవీ గండం, ఎన్టీఆర్ ప్రభంజనం, చంద్రబాబు సహకారం'
అమరావతి: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. వెంకయ్యనాయుడు నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీలో ఎవరికీ దక్కని గౌరవం ఆయనకు లభిస్తోందని అన్నారు. దక్షిణాదికి చెందిన వ్యక్తి అయి ఉండి, ఉత్తరాది నుంచి రాజ్యసభ సభ్యత్వం సంపాదించిన ఏకైక వ్యక్తి వెంకయ్యనాయుడు అని కితాబునిచ్చారు. ఒక వ్యక్తి అనుకుంటే.. ఏదైనా సాధించవచ్చు అనేందుకు వెంకయ్య నాయుడే ఉదాహరణ అని అన్నారు.

క్షణం కూడా విరామం లేకుండా పని చేయడం వెంకయ్యనాయుడు బలమని ఆయన చెప్పారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా ఆయన సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని ప్రశంసించారు. ఏ విషయంలోనూ రాజీ పడని వ్యక్తి వెంకయ్యనాయుడని అన్నారు. ఆయనది విశిష్ఠ వ్యక్తిత్వం.. పనిలో ఎప్పుడూ ఆనందం పొందుతారని కొనియాడారు.
అనంతరం వెంకయ్య మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రం తరుపు నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన సందర్భంగా చాలా మంది వస్తామని తనను ఆడిగారని చెప్పుకొచ్చారు. దీనికి తాను ఎందుకయ్యా నేనేమన్నా తొలిసారి రాజ్యసభకు వెళ్తున్నానా? అని వారిని వారించానని అన్నారు.
'నా భార్య ఎలాగూ రాదు, ఆమెకి రాజకీయాలంటే ఆసక్తి ఉండదు. కనీసం నా పిల్లలను కూడా నామినేషన్‌కు రాలేదు' అని అన్నారు. కాగా, చంద్రబాబు సహకారంతో తాను రాజ్యసభ సీటు సంపాదిస్తానని మీడియా రాసిందని, దానిని చూసి నవ్వుకున్నానని ఆయన చెప్పారు. దీంతో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంతవరకు పాల్గోలేదని కూడా రాసేశారని ఆయన చెప్పారు.
ఇప్పుడు పేపర్లో రాసినవారంతా తాను ప్రత్యక్ష రాజకీయాల్లో అద్భుత విజయం సాధించినప్పుడు పుట్టలేదని ఆయన చెప్పారు. నెల్లూరులో ఎన్టీఆర్ ప్రభజనంతో ప్రతిపక్షనేతలు విజయం సాధించడానికి నానా తంటాలు పడుతుంటే, తానొక్కడినే విజయం సాధించానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఎన్టీఆర్ ప్రచారం చేసినప్పటికీ టీడీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయాడని గతాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు ప్రత్యక్ష రాజకీయాలు కొత్త కాదు, పరోక్ష రాజకీయాలు కూడా కొత్త కాదని ఆయన చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ ప్రాంతానికి పరిమితం అవుతామని, అందుకే పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు.
పార్టీలో మైక్ అనౌన్సర్ స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయికి ఎదిగానని చెప్పారు. అద్వానీ పక్కన కూర్చొని పనిచేస్తానని ఎప్పుడూ అనుకోలేదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అంతేకాదు తాను ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన నాయకుడినని అన్నారు. అలాంటి తాను వేరే పార్టీకి చెందిన వ్యక్తుల సహకారంతో రాజ్యసభలో అడుగుపెడతానా? అని ప్రశ్నించారు.
తాను బీజేపీ కోసం అహర్నిశలు ఎలా కష్టపడ్డానో అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు. అలాగే పోరాటం కూడా తనకు కొత్త కాదని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో నాపై విమర్శలు చేసిన వారికి గురించి పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు.
తనకు పదవీ గండం ఉందని, 3 సార్లు కంటే ఎక్కువ పదవిరాదని కొందరు అన్నారని అన్నారు. ఇదే విజయవాడలో ఎమర్జెన్సీ సమయంలో ఒకసారి, జై ఆంధ్ర ఉద్యమం సమయంలో ఒకసారి అరెస్టై జైలుకు కూడా వెళ్లానని చెప్పుకొచ్చారు.
ఇప్పుడంటే చంద్రబాబు హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం వల్ల అది పెద్ద నగరం అయిందని, లేదంటే అంతకు ముందు ఏపీ రాజకీయాలు, వ్యాపారం, సినిమాలు ఇలా రంగాలన్నీ విజయవాడలోనే ఉన్నాయన్నారు. రాజకీయంగా ఎదిగే క్రమంలో విజయవాడ ఎంతో దోహదపడిందని వెంకయ్య అన్నారు.












Click it and Unblock the Notifications