జగన్ కేబినెట్ విస్తరణ- మంత్రులుగా వేణు, అప్పలరాజు ప్రమాణం- శాఖలివే...
ఆంధ్రప్రదేశ్ లో అంతా ఊహించినట్లుగానే జగన్ కేబినెట్ విస్తరణ చేపట్టారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో విజయవాడ రాజ్ భవన్ లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం సాదాసీదాగా జరిగింది. కొత్త మంత్రులుగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం శాసనసభ్యుడు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, శ్రీకాకుళం జిల్లా పలాస శాసనసభ్యుడు సీదిరి అప్పలరాజు ప్రమాణస్వీకారం చేశారు రాజ్ భవన్ దర్బార్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగన్ కేబినెట్ లో ప్రస్తుతం ఉన్న మంత్రులతో పాటు అతి కొద్ది మంది అధికారులు మాత్రమే హాజరయ్యారు.
Recommended Video
కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వేణుగోపాలకృష్ణ, అప్పలరాజుతో పాటు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ పొందిన ధర్మాన కృష్ణదాస్ తో కలిసి సీఎం జగన్ గవర్నర్ ఫొటో సెషన్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత కొత్త మంత్రులను జగన్ గవర్నర్ హరిచందన్ కు పరిచయం చేశారు. దీంతో ఈ కార్యక్రమం ముగిసింది.

కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రాజ్ భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అతి తక్కువ మందిని అహ్వానించారు. ప్రస్తుత కేబినెట్ మంత్రులు కూడా భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ తో పాటు అందరూ మాస్క్ లు ధరించారు. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం సమయంలో మాత్రం మాస్కులు ధరించలేదు.

కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో వేణుగోపాలకృష్ణకు రోడ్లు, భవనాలు, సీదిరి అప్పలరాజుకు మత్స్య, పాడి పరిశ్రమల శాఖ అప్పగించారు. అలాగే ఇప్పటివరకూ రోడ్లుభవనాల శాఖను చూసిన ధర్మాన కృష్ణదాస్ కు గతంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ చూసిన రెవెన్యూశాఖతో పాటు డిప్యూటీ సీఎం పదవిని కూడా అప్పగించారు. దీంతో కేబినెట్ కు రాజీనామా చేసిన ఇద్దరు బీసీ మంత్రుల స్ధానంలో మరో ఇద్దరు బీసీ మంత్రులు వచ్చినట్లయింది. అలాగే బీసీ డిప్యూటీ సీఎం పదవి మరో బీసీ మంత్రికి అప్పగించినట్లయింది.













Click it and Unblock the Notifications