నేడు జగన్ కీలక భేటీ: తాడేపల్లి కేంద్రంగా.. పొలిటికల్ స్ట్రాటజీ
మెగా డీఎస్సీ నియామకాల్లో చోటు చేసుకున్నట్లు భావిస్తోన్న అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన ర్యాలీలు విజయవంతం కావడం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతనోత్తేజాన్ని తీసుకొచ్చినట్టయింది. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో ఈ ర్యాలీలకు తరలివచ్చారు. తమ నిరసన గళాన్ని వినిపించారు.
డీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ, ఈ ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఈ స్కామ్‌కు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ సైతం డిమాండ్ చేస్తోన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.9,000 కోట్లు, వసతి దీవెన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంటింటికీ రాసిచ్చిన బాండ్లల్లో పేర్కొన్న విధంగా, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నెలకు రూ.3,00 చొప్పున నిరుద్యోగ భృతి బకాయిలతో కలిపి చెల్లించాలని అన్నారు.

ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్ నేడు కీలక సమావేశాన్ని నిర్వహించబోతోన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. ఈ ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణ ప్రణాళికలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
ప్రజలకు సంబంధించిన అంశాలపై పార్టీ ప్రజాప్రతినిధులు అనుసరించాల్సిన పోరుబాటపై వైఎస్ జగన్ పలు సూచనలు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై భవిష్యత్ లో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేస్తారని పేర్కొన్నాయి.
ఈ నెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ, శాసన మండలి వర్షాకాల సమావేశాలు సైతం ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు గైర్హాజర్ అవుతున్నప్పటికీ.. మండలికి మాత్రం క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. దీంతో మండలిలో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సందర్భంగా ఎమ్మెల్సీలతో చర్చిస్తారని తెలుస్తోంది. విద్యార్థులు, రైతులు, మహిళలు, నిరుద్యోగులు, యువత.. ఇలా అన్ని వర్గాల ప్రజల సమస్యలపై మాట్లాడతారని సమాచారం.












Click it and Unblock the Notifications