సంచలనం:ఆవులను సంరక్షణ కోసం పంపితే...అమ్ముకున్న పశువైద్యుడు;అరెస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీకాకుళం:మూగజీవాలను కాపాడే వైద్య విద్య చదివి ఆ నోరు లేని జీవుల పాలిట కాల యముడిలా పశువైద్యుడి ఉదంతమిది....గోవులను కంటికి రెప్పలా కాపాడతానని కల్లబొల్లి కబుర్లు చెప్పి గోశాలను ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో అక్కడకు సంరక్షణ కోసం తరలించిన వేలాది ఆవులను ఈ డాక్టర్ కబేళాకు తరలించి అమ్ముకున్నాడు.

అయితే అక్రమ దందా అనుకోకుండా వెలుగులోకి రావడంతో ఎట్టకేలకు ఈ కసాయి వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు విచారణ జరిపే కొద్దీ ఇతగాడి అనేక అక్రమ లీలలు వెలుగు చూస్తున్నాయి. గత నెల 27నే ఈ పశు వైద్యుడి నేరాల గురించి బైటపడినా కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చకోవడంతో పోలీసులు ఏ చెయ్యలేకపోయారు. అయితే తాజాగా ఇతడిపై మరో కేసు నమోదవడంతో విచారణ జరిపి పోలీసులు అరెస్ట్ చేశారు.

 పశు వైద్యుడు సూర్యం...చాలా ఘోరం

పశు వైద్యుడు సూర్యం...చాలా ఘోరం

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇతడో పశువైద్యుడు...పేరు సూర్యం...వృత్తి వెటర్నరీ డాక్టరే అయినా ప్రవృత్తిలో మాత్రం చాలా కంత్రీ...అందుకే మూగజీవాలను అడ్డుపెట్టుకొని అడ్డదారిలో డబ్బు సంపాదించడానికి చాలా పెద్ద, నీచమైన ప్లాన్ వేశాడు. అందులో బ్లూ క్రాస్ ను కూడా భాగస్వామిని చేసి వాడుకున్నాడంటేనే ఇతగాడెంత కంత్రీనో, ఎంత పక్కా ప్రొఫెషనల్ గా నేరాలకు పాల్పడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ముందుగా గోవులను రక్షిస్తానంటూ ఓ గోశాలను ఏర్పాటుచేశాడు. ఇందుకు బ్లూ క్రాస్ పేరు వాడుకున్నాడు.

 దందా...జరిగే వైనమిదే...

దందా...జరిగే వైనమిదే...

ఆ తరువాత జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా వాహనాల్లో పశువులను తరలిస్తుంటే వెంటనే సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్‌కు ఆ సమాచారం చేరుతుంది. ఆ తర్వాత బ్లూక్రాస్ ప్రతినిధులు వెంటనే రంగంలోకి దిగుతారు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల వరకు చేరేలా జాగ్రత్త వహిస్తారు. ఆ తరువాత పోలీసులు ఎంత బిజీలో ఉన్నా తప్పనిసరై సదరు వాహనాన్ని పట్టుకుని కేసు నమోదు చేస్తారు. పట్టుకున్న పశువులను ఏం చెయ్యాలనే ప్రశ్న రాగానే వాటిని మెళియాపుట్టి మండలం పట్టుపురంలోని గోశాలకు తరలించాలని బ్లూక్రాస్ ప్రతినిధులు సూచిస్తారు. సహజంగానే పోలీసులకు వాటి సంరక్షణ ఇబ్బంది కాబట్టి, ఆల్రెడీ అక్కడ గోశాల ఉంది కాబట్టి అక్కడ మంచి సంరక్షణ లభిస్తుందని భావించి వాటిని అక్కడకు పంపుతారు. అలా తన గోశాలకు చేరిన ఆ గోవులను ఈ పశు వైద్యుడు దర్జాగా కబేళాకు విక్రయించేవాడు.

పశువుల దందా...బైటపడిందిలా...

పశువుల దందా...బైటపడిందిలా...

ఈ క్రమంలో శ్రీకాకుళంలో రోడ్డు మీద తిరుగుతున్నకొన్నిఆవులను మున్సిపల్ కమిషనర్ పట్టుపురం గోశాలకు తరలించారు. సాధారణంగా గోశాలకు తరలించిన తర్వాత ఆ గోవులను మళ్లీ వెనక్కి తీసుకెళ్లేందుకు ఎవరూ రారు. అయితే ఈ ఘటనలో మాత్రం మున్సిపాటిటీ విధించిన జరిమానా రూ.2500 చొప్పున కట్టేసి, తమ పాడి ఆవులను తోలుకెళ్దామని వాటికి సంబంధించిన వారు వచ్చారు. అయితే వారికి సంబంధించిన కొన్ని ఆవులు ఉన్నాయి కానీ మరికొన్ని లేవు. కాపలావారు ఇచ్చిన సమాచారం ప్రకారం వీరు తమ గోవుల కోసం అన్వేషించగా వీటిని నారాయణవలస సంతకు తరలిస్తున్న వాహనం గుర్తించారు. ఆ వాహన డ్రైవర్‌ను గట్టిగా ప్రశ్నిస్తే డాక్టర్ సూర్యం విషయం బైటపెట్టాడు. దీంతో పశువుల యజమానులు పోలీసు కేసు పెట్టారు.

డాక్టర్ బండారం బట్టబయలు...పరారు

డాక్టర్ బండారం బట్టబయలు...పరారు

దీంతో పోలీసులు ఈ వ్యవహారంపై మరింతలోతుగా విచారిస్తే ఈ దందా గడచిన ఐదేళ్లుగా సాగుతోందని,ఈ విధంగా ఆ డాక్టర్ వేలాది పశువులను అమ్మున్నట్లుగా తెలియవచ్చింది. అసలు ఆ గోశాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, వేల సంఖ్యలో ఉండాల్సిన గోవులు పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నాయని గుర్తించి ఆ పశు వైద్యుడిపై ఐపీసీ 409, 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో తనపై కేసు నమోదైందన్న విషయం తెలుసుకున్న డాక్టర్ సూర్యం పరారయ్యాడు. ఆ తరువాత కొద్దిరోజులకు కోర్టు నుంచి ముందస్తు బెయిలు తెచ్చుకున్నాడు. దీంతో పోలీసులు చేసేదేం లేక మిన్నకున్నారు.

 ఎట్టకేలకు మరో కేసులో దొరికాడు...అరెస్ట్

ఎట్టకేలకు మరో కేసులో దొరికాడు...అరెస్ట్

ఈ నేపథ్యంలో ఆదివారం ఈ కసాయి డాక్టర్ సూర్యంపై మెళియాపుట్టు పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. అయితే ఈ ఫిర్యాదు కూడా పోలీసులే ఇవ్వడం గమనార్హం. గతంలో జాతీయ రహదారిపై పట్టుకున్న 12 ఆవులను తాము సూర్యం నిర్వహిస్తున్న గోశాలకు అప్పగించామని, అయితే అక్కడకు వెళ్లి పరిశీలిస్తే తాము పంపిన ఆవులు కనిపించలేదని, వాటిని డాక్టర్ సూర్యం అమ్మేసినట్లు తెలిసిందని పలాస పలాస ఎస్‌ఐ స్వయంగా ఫిర్యాదు చేయడంతో ఈ కంచే చేను మేసిన చందంగా వ్యవహరించిన ఈ నీచపు డాక్టర్ సూర్యంను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇతడిని పలాస కోర్టులో హాజరుపర్చగా ఈ నెల 27 వరకు రిమాండ్ విధించారు.

శాఖాపరంగానూ...ఛీటింగే...చర్యలకు సిఫార్స్

శాఖాపరంగానూ...ఛీటింగే...చర్యలకు సిఫార్స్

ఇదిలావుండగా విచారణలో భాగంగా పోలీసులు ఆసుపత్రి రికార్డులను స్వాధీనం చేసుకున్న క్రమంలో మరి కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కులపేట వెటర్నరీ హాస్పిటల్ లో పశు వైద్యుడిగా పనిచేస్తున్ప డాక్టర్ సూర్యం అక్టోబరు 1, 2017 డ్యూటీకి విధులకు హాజరుకాకున్నా ప్రతి నెల ఠంచనుగా జీతం అందుకుంటున్నట్లు తెలిసింది. మరోవైపు ఈ డాక్టర్ సుమారు 3000 పైగా పశువులను విక్రయించినట్లు పోలీసులు అంచనా వేశారు. అంతేకాదు ప్రభుత్వ పశువైద్యుడిగా ఉంటూ పోలీసు, పశుసంవర్థక శాఖ ఎన్నో ఏళ్లుగా సంరక్షణ కోసం ఇచ్చిన ఆవులను సంతలకు విక్రయించిన సూర్యం వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి ఇతడిపై సీబీసీఐడీ విచారణకు సిఫార్సు చేశారు. అలాగే విధుల నుంచి సస్పెండ్‌ చేయాలని పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌కూ ఒక నివేదికను సైతం పంపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Srikakulam: On the complaint of missing cattle lodged at Palasa police station by the cattle owners who handed over their animals to a cattle home at Pattupuram village in Meliaputti mandal, in this background police arrested Dr. Suryam on Sunday and produced him before the Palasa court.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X