చెన్నైని ఆదుకోరూ..! చంద్రబాబును కోరిన విజయ్..! తొలి భేటీలోనే హామీ..!
ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు(Chandrababu), విజయ్ (Vijay) ఇవాళ తొలిసారి భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు అమరావతికి వచ్చిన సీఎం విజయ్.. ఏపీ సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జల వివాదాలు, అవసరాలు, ఇతర అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ముందు తమిళ సీఎం విజయ్ కీలక ప్రతిపాదనలు పెట్టారు.
విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సీఎం చంద్రబాబు నాయుడుతో ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. క్యాంప్ ఆఫీసుకు వచ్చిన సీఎం విజయ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు పలు అంశాలపై అధికారులతో కలిసి చర్చించారు. ప్రధానంగా గోదావరి-కావేరి నదుల అనుసంధానం ఆవశ్యకతను సీఎం చంద్రబాబు సమావేశంలో వివరించారు. నదుల అనుసంధానం కరువుకు శాశ్వత పరిష్కారంగా చంద్రబాబు తెలిపారు.

మరోవైపు తెలుగు గంగ ద్వారా చెన్నైకు మరింతగా తాగునీరు విడుదల చేయాలని సీఎం విజయ్ చంద్రబాబును కోరారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో కృష్ణా జలాలు తగ్గడం, తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొన్నప్పటికీ చెన్నయ్ దాహార్తి తీర్చే విషయంలో ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఇప్పటికే 4.08 టీఎంసీల నీటిని చెన్నై నగరానికి విడుదల చేసినట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. నీటి లభ్యత, అవసరాలకు అనుగుణంగా మరికొంత నీటిని విడుదల చేయడంపైనా ఆలోచన చేస్తామని చెప్పారు. దీంతో విజయ్ చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీలో విజయ్ కేబినెట్ మంత్రి, టీవీకే కీలక నేత అయిన అధవ్ అర్జున కూడా పాల్గొన్నారు. తొలిసారి సీఎం చంద్రబాబును కలిసేందుకు వచ్చిన విజయ్.. తమిళనాడు సంప్రదాయ ధోతీ, పంచెకట్టులో రావడం విశేషం. అలాగే తనకన్నా ఎంతో సీనియర్ అయిన చంద్రబాబుతో ఎలాంటి అరమరికలు లేకుండా వచ్చిన పని గురించి మాట్లాడి వెళ్లారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న విజయ్.. అవసరాల మేరకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రంతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు పొరుగు రాష్ట్రమైన ఏపీ విషయంలోనూ అదే వైఖరి కనబరిచారు.













Click it and Unblock the Notifications
