ఆకర్షణ: ఇందిరలా డ్రెస్ చేసుకోనున్న విజయశాంతి
హైదరాబాద్: మెదక్ పార్లమెంటు సభ్యురాలు, మెదక్ అసెంబ్లీకి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్న విజయశాంతి తన వేషధారణ దివంగత ప్రధాని ఇందిరా గాంధిలా ఉండేలా చూసుకోనున్నారట. విజయశాంతిని లేడీ అమితాబ్ బచ్చన్ అంటారు. ఒసేయ్ రాములమ్మ సినిమా తర్వాత ఆమెను రాములమ్మగా కూడా పిలుస్తుంటారు.
గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసి గెలిచిన విజయశాంతి.. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసు పార్టీలో చేరారు. మెదక్ అసెంబ్లీ నుండి బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెసు పార్టీలో చేరిన ఆమె ఓటర్లను మరింతగా ఆకట్టుకునేందుకు తన వేషధారణ ఇందిరలా ఉండేలా చూసుకోనున్నారట.

విజయశాంతి తొలుత భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఆమె లక్ష్యం. ఇందుకోసం బిజెపి నుండి బయటకు వచ్చి తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు.
ఆ తర్వాత తన పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో కలిపేశారు. 2009లో ఆ పార్టీ తరఫునే విజయం సాధించారు. తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో విభేదాలు వచ్చాయి. దీంతో ఆమె బిజెపిలోకి వెళ్తుందని అందరు భావించారు. అంతలోనే కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వడంతో ఆమె చేయికి ఓటేశారు. ఇప్పుడు అదే కాంగ్రెసు పార్టీ దివంగత నేత ఇందిరలా డ్రస్ చేసుకొని ఓటర్లను ఆకట్టుకోనున్నారట.












Click it and Unblock the Notifications