చనిపోయాక ఆస్తులన్నీ మెదక్ ప్రజలకే: విజయశాంతి
మెదక్/కరీంనగర్: తన మృతి తర్వాత తన ఆస్తులన్నింటిని మెదక్ ప్రజలకే రాసిక్తానని కాంగ్రెసు పార్టీ మెదక్ అసెంబ్లీ అభ్యర్థి విజయశాంతి బుధవారం అన్నారు. వెనుకబడిన మెదక్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం కుటుంబ సభ్యుల కోసం ఆరాటపడుతున్నారని విమర్శించారు.
కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి కోరుకోవడమే తప్పని ఆమె అభిప్రాయపడ్డారు. మెదక్ పార్లమెంటుతో పాటు గజ్వేల్ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోతారన్నారు. రాజకీయాల్లో కెసిఆర్ ఓ పెద్ద దొంగ అని, దళిత ముఖ్యమంత్రి అని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. తెలంగాణపై మాట నిలబెట్టుకున్న ఘనత ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీదే అన్నారు.

కెసిఆర్‌పై దామోదర
ఉద్యమ పార్టీ అంటూ ప్రగల్భాలు పలికి తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో కలిపేస్తామంటూ పేర్కొన్న కెసిఆర్ నేడు మాట తిప్పి, మాట మార్చిన పచ్చిమోసగాడని యావత్ తెలంగాణ ప్రజలు పేర్కొంటున్నారని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన సోనియా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
నీతి, నిజాయితీకి తెలంగాణ ప్రజలు పెట్టింది పేరని, అలాంటి తెలంగాణ ప్రజలకు అన్నం పెట్టినదానికి సున్నం పెట్టే సంస్కృతిని టిఆర్‌ఎస్ తెచ్చిందని, కానీ సోనియాగాంధీ ఇక్కడే ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ఎదుర్కొని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ ప్రజల గుండెల్లో గుడి కట్టుకుందన్నారు.












Click it and Unblock the Notifications