విజయవాడ-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే.. అప్పటిలోగా ట్విన్ టన్నెల్స్ నిర్మాణం!
కేంద్రం తెలుగురాష్ట్రాల్లో జాతీయ రహదారుల అభివృద్ధికి పెద్ద పీట వేసి నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో రహదారుల విస్తరణపై ఫోకస్ చేసిన కేంద్రం విజయవాడ నుంచి బెంగళూరు వరకు ప్రయాణాన్ని సులభతరం చేసే గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే-544జీ నిర్మాణ పనుల్లో వేగం పెంచింది.
ఆరు లేన్ల ఎక్స్ ప్రెస్ హైవేలో రెండు ప్రత్యేక సొరంగ మార్గాల నిర్మాణం
కేంద్ర ప్రభుత్వం ఈ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేను మొత్తం 518 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తోంది. ఇది విజయవాడ నుంచి ప్రారంభమై గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదుగా కడప జిల్లా వరకు విస్తరించనుంది. ప్రస్తుతం ఈ మార్గంలో భారీ సొరంగాల నిర్మాణం జరుగుతోంది. నెల్లూరు జిల్లా సీతారామపురం నుంచి కడప జిల్లా వరకు రెండు ప్రత్యేక సొరంగ మార్గాలను నిర్మిస్తున్నారు.

సీతారామపురం వద్ద కొనసాగుతున్న పనులు
ఒక్కో టన్నెల్ సుమారు 3.68 కిలోమీటర్ల పొడవు ఉండనుంది. రెండు కలిపి మొత్తం 7.5 కిలోమీటర్ల మేర సొరంగం వస్తుంది. ఈ ప్రాజెక్టుకు రూ.801 కోట్లు కేటాయించారు. 2025లో అనుమతులు లభించి, గత జూన్ నెలలో నిర్మాణం ప్రారంభం కాగా, ప్రస్తుతం సీతారామపురం వద్ద పనులు పుంజుకున్నాయి. ప్రతి టన్నెల్ 16.7 మీటర్ల వెడల్పు, 10.4 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నారు.
2027లో డిసెంబర్‌లో సొరంగాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యం
కాంక్రీట్ లైనింగ్ పూర్తయిన తర్వాత 14.7 మీటర్ల వెడల్పు, 9 మీటర్ల ఎత్తుతో ఉంటాయి. 2027 నాటికి కాంక్రీట్ లైనింగ్ పూర్తి చేసి, అదే సంవత్సరం డిసెంబర్‌లో సొరంగాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఈ హైవే శ్రీ సత్యసాయి జిల్లా కోడికొండ వద్ద ప్రారంభమై కడప, నెల్లూరు జిల్లాల మీదుగా ప్రకాశం జిల్లా ముప్పవరం వద్ద నేషనల్ హైవే-16తో కలుస్తుంది.
విజయవాడ-బెంగళూరు మధ్య 130 కిలోమీటర్లు తగ్గనున్న దూరం
సీతారామపురం మీదుగా 167 బీజీ, 167 బి హైవేలకు అనుసంధానం ఉంటుంది. ఈ నేషనల్ హైవే పూర్తయితే విజయవాడ-బెంగళూరు మధ్య దూరం సుమారు 130 కిలోమీటర్లు తగ్గి, ప్రయాణ సమయం కేవలం ఆరు గంటలకు పరిమితమవుతుంది. ప్రయాణికులు కేవలం 13 ప్రాంతాల్లో మాత్రమే ఈ హైవేపైకి ప్రవేశించగలరు. ఈ ప్రాజెక్టు ఏపీ, కర్ణాటక మధ్య రవాణా వ్యవస్థను బలోపేతం చేసి, వాణిజ్య, పర్యాటక రంగాలకు కొత్త ఊపు తీసుకురానుంది.













Click it and Unblock the Notifications