విజయవాడ బెంగళూరు వందేభారత్ పై శుభవార్త.. నాలుగున్నర గంటల్లోనే తిరుమలకు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే శుభవార్త చెప్పింది. రైలు ప్రయాణికుల సౌకర్యార్థం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటున్న ఇండియన్ రైల్వే ఏపీకి మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ఇచ్చి వరం ప్రకటించింది. రాష్ట్రానికి కొత్త రైలును మంజూరు చేసింది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న విజయవాడ బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభానికి కూడా ముహూర్తం ఫిక్స్ చేసింది.
ఏపీకి కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్
రైల్వే శాఖ ఇటీవల ఏపీకి ఇచ్చిన కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ మార్గాన్ని, షెడ్యూల్ ని ఖరారు చేసింది. నవంబర్ నెలాఖరుకు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభిస్తామని సూచన ప్రాయంగా పేర్కొంది. విజయవాడ బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ మంగళవారం మినహాయించి మిగతా అన్ని రోజుల్లోనూ ప్రయాణికులకు తన సేవలను అందిస్తుంది. ఈ రైలు ద్వారా విజయవాడ నుండి బెంగళూరుకు 9 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది.

విజయవాడ నుండి బయలుదేరి బెంగళూరుకు చేరుకుంటుంది ఇలా
ఈ రైలు విజయవాడ నుంచి బయలుదేరి తెనాలి, ఒంగోలు ,నెల్లూరు , తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, కృష్ణరాజపురం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. మొత్తం ఎనిమిది బోగీలతో ఉండే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏడు ఏసీ చైర్ కార్ బోగీలు, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ బోగీ తో ఉంటుంది.
విజయవాడ బెంగళూరు వందే భారత్ షెడ్యూల్ ఇలా
20711 నెంబర్ తో నడిచే ఈ రైలు ఈరోజు ఉదయం 5 గంటల 15 నిమిషాలకు విజయవాడలో బయలుదేరి, మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు బెంగళూరుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 20712 మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు బెంగళూరులో బయలుదేరి రాత్రి 11 గంటల 45 నిమిషాలకు విజయవాడ చేరుకుంటుంది.
తిరుపతికి నాలుగున్నర గంటల్లోనే
ముఖ్యంగా ఈ రైలు విజయవాడ నుంచి బెంగళూరుకు ప్రయాణం చేసే వారికి మాత్రమే కాకుండా, తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రైలు అందుబాటులోకి వస్తే కేవలం నాలుగున్నర గంటల్లోనే విజయవాడ నుండి తిరుపతికి చేరుకోవచ్చు. విజయవాడలో ఉదయం ఐదు గంటల 15 నిమిషాలకు బయలుదేరి ఈ రైలు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారికి పండుగే
బెంగళూరు నుంచి వచ్చే రైలు సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది. ప్రస్తుతం విజయవాడ నుండి బెంగళూరుకు కొండవీడు ఎక్స్ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా వారంలో మూడు రోజులు మాత్రమే నడుస్తుంది. ఈ నేపథ్యంలో విజయవాడ బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు ఎంతో సౌకర్యాన్ని అందిస్తుందని, ముఖ్యంగా తిరుమల వెళ్లాలనుకునే వారికి మాత్రం ఇది వరంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications