Vijayawada Boy : విజయవాడలో డ్రైనేజీలో పడి ఆరేళ్ల బాలుడు మృతి-ఏం జరిగిందంటే ?
తాజాగా హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుండగా మౌనిక అనే బాలిక మ్యాన్ హోల్లో పడి చనిపోయిన ఘటన మరువకముందే ఏపీలోని విజయవాడలోనూ దాదాపు అలాంటి ఘటనే చోటు చేసుకుంది. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఉన్న ఓ డ్రైనేజీలో పడిన ఓ ఆరేళ్ల బాలుడు నీళ్లలో కొట్టుకుపోయి ఊపిరాడక చనిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాలుడు గల్లంతు అయినట్లు తేలడంతో మున్సిపల్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది.
విజయవాడలో ఇవాళ మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి పలు రోడ్లు జలమయం అయ్యాయి. ఈ సమయంలో గురునానక్ కాలనీలోనూ వర్షం కారణంగా రోడ్లు జలమయం అయ్యాయి. గంటసేపు కురిసిన వర్షానికి మురుగుకాల్వలోనూ భారీగా నీరు చేరింది. అదే సమయంలో అక్కడే ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు కాలుజారి నీటిలో పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో మురుగుకాల్వలోకి జారిపోయాడు. విషయం తెలియగానే మున్సిపల్ సిబ్బందికి స్ధానికులు సమాచారమిచ్చారు.

గురునానక్ కాలనీలో బాలుడు గల్లంతైనట్లు తెలియడంతో విజయవాడలో ఒక్కసారిగా కలకలం రేగింది. సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ కుమారుడి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. చివరికి కిలోమీటర్ దూరంలో బాలుడి మృతదేహాన్ని మున్సిపల్ సిబ్బంది గుర్తించారు. మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు.
విజయవాడలో డ్రైనేజీలో పడి ఆరేళ్ల బాలుడు మృతి-ఏం జరిగిందంటే ? #Vijayawada #ViralVideo #TeluguNews #Oneindiatelugu pic.twitter.com/3ylEYLCzdN
— oneindiatelugu (@oneindiatelugu) May 5, 2023
విజయవాడలో చోటు చేసుకున్న బాలుడి మృతి ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాలువలపై పూర్తిస్ధాయిలో మూతలు వేయాలని పలుమార్లు స్ధానికులు విజ్ఞప్తి చేసినా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో రోడ్లపై మోకాళ్ల లోతు చేరిన నీరు కాల్వల్లోకి పోయే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్ధానికులు చెప్తున్నారు. ఇప్పటికైనా కార్పోరేషన్ అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications