వరదల వేళ.. ఏపీ మంత్రుల త్యాగం
Vijayawada floods 2024: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో దంచికొట్టిన అతి భారీ వర్షాల తీవ్రత ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. మరింత పెరుగుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తుతోంది. దీని ప్రభావం ప్రకాశం బ్యారేజీ తీవ్రంగా పడింది.
బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. సింగ్‌నగర్, చిట్టినగర్, సితార, రాజరాజేశ్వరి పేట, యనమలకుదురు, జక్కంపూడి వంటి ప్రాంతాలవాసులు వరద నీటిలో కాలం వెళ్లదీస్తోన్నారు.

జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది వారికి సహాయాన్ని అందించారు. ఆహారం పాకెట్లు, మంచినీటిని సరఫరా చేశారు. రాత్రి వేళా సహాయక చర్యలు కొనసాగాయి. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లలో ఇంటింటికీ వెళ్లి, ఆహారం, నిత్యావసర సరుకులు అందించారు.
ప్రకాశం బ్యారేజీకి వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కనిపించింది. రాత్రికి దీని తీవ్రత 11.20 లక్షల క్యూసెక్కులకు తగ్గినట్లుగా విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.
వర్షాలు, వరద తీవ్రత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సహాయక, పునరావాస చర్యలను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పార్టీ క్యాడర్ సహాయ, సహకారాలనూ తీసుకుంటోంది. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు.

అదే సమయంలో తన సహచర మంత్రులకూ నారా లోకేష్ కీలక సూచన చేశారు. మంత్రులు తమ ఎస్కార్ట్ వాహనాలను ఉపసంహరించుకోవాలని, వాటిని వరద బాధితుల సహాయ కార్యక్రమాల కోసం కేటాయించాలని కోరారు. ఆయన చేసిన సూచనలకు మంత్రులు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు.
చిట్టచివరి బాధితులకు ప్రభుత్వ సహాయం అందించడానికి వీలుగా మంత్రులు తమ ఎస్కార్ట్ వాహనాలు వినియోగించాలని నిర్ణయించారు. నిత్యావసర వస్తువులు, ఆహారం పాకెట్లు, మంచినీటిని వరద బాధితులకు అందించే వాహనాలకు ఎస్కార్ట్‌గా మంత్రుల వాహనాలను వినియోగిస్తారు.












Click it and Unblock the Notifications