ఏపీలో ఎంపీ, ఎమ్మెల్యేలపై 78 కేసులపెండింగ్! హైకోర్టుకు కీలక రిపోర్ట్!
ఏపీలో ఎన్నికల వేళ క్రిమినల్ కేసులతో కాలం వెళ్లదీస్తున్న ప్రజాప్రతినిధులకు షాక్ తగిలేలా కనిపిస్తోంది. ముఖ్యంగా క్రిమినల్ కేసులు నమోదైనా విచారణలు ఆలస్యం అవుతున్న ప్రజాప్రతినిధులకు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు శరాఘాతంగా మారాయి. ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇందుకోసం హైకోర్టులో ప్రత్యేక బెంచ్ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు.. ఏపీలో ఎంపీ, ఎమ్మెల్యేలపై విచారణ పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు కోరుతూ విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై స్పందించిన విజయవాడ కోర్టు.. తాజాగా 78 మంది ప్రజాప్రతినిధులపై ఉన్న పెండింగ్ కేసుల్ని హైకోర్టుకు నివేదించింది. వీటిపై సత్వర విచారణ చేపట్టేందుకు వీలుగా పూర్తి వివరాలతో రిపోర్టు అందజేసింది. దీనిపై హైకోర్టు చర్యలు తీసుకునేందుుక సిద్ధమవుతోంది.

ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన 78 కేసులపై విజయవాడ కోర్టు నుంచి నివేదిక తెప్పించుకున్న హైకోర్టు.. ఇప్పుడు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటయ్యే ఈ బెంచ్ కేవలం ప్రజా ప్రతినిధులపై పెండింగ్ కేసుల్ని మాత్రమే విచారిస్తోంది. దీంతో ఈ విచారణ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో బెంచ్ పనిచేయనుంది. ఈ నేపథ్యంలో ఈ 78 కేసుల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.
అసలే ఎన్నికల వేళ అఫిడవిట్లలోనూ తమపై పెండింగ్ కేసులు పేర్కొనాల్సిన పరిస్దితి. అలాగే ఈ 78 కేసుల్లోనూ రెండేళ్లకు పైగా శిక్ష పడితే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల్లో పోటీకి అనర్హులయ్యే పరిస్ధితి ఉంటుంది. కాబట్టి హైకోర్టు ప్రత్యేక బెంచ్ జరిపే విచారణపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంటోంది.












Click it and Unblock the Notifications