విజయవాడ, విశాఖపై సర్కార్ కీలక నిర్ణయం..! పీపీపీపై జగన్ రచ్చ వేళ..!
ఏపీలో రాజధాని అమరావతిలో భాగమైన విజయవాడ నగరంతో పాటు ఐటీ రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంపై కూటమి సర్కార్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నగరాల్లో రాబోయే రోజుల్లో జరిగే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో విపక్ష వైసీపీ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ రచ్చ చేస్తున్న వేళ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
విజయవాడ, విశాఖపట్నంలో రోడ్లను ప్రయోగాత్మకంగా పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ రెండు నగరాల్లో కలిపి మొత్తం 112 కిలోమీటర్ల మేర రోడ్లను రూ.478 కోట్ల ఖర్చుతో చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొత్తం 56 పనులుగా వీటిని విభజించారు. వీటి కోసం మున్సిపల్ శాఖ త్వరలో టెండర్లు కూడా ఆహ్వానించబోతోంది. ఈ రోడ్ల పనులు చేసిన కాంట్రాక్టర్లకు పదేళ్లలో ఆ మొత్తం వసూలు చేసుకునే అవకాశం కల్పిస్తారు.

విజయవాడ, విశాఖలో నగరపాలక సంస్థలు ఈ రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల్లో 40 శాతం తొలి ఏడాది కాంట్రాక్టర్లకు చెల్లిస్తాయి. మిగతా 60 శాతాన్ని మాత్రం పదేళ్లలో వాటికి దశల వారీగా చెల్లిస్తాయి. దీని కోసం ప్రత్యేక ఎస్క్రో అకౌంట్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో భాగంగా రోడ్లతో పాటు ఫుట్ పాత్ లు, లైట్లు, ట్రాఫిక్ సైన్ బోర్డులు, బెంచీలు, చెత్తబుట్టలు, హాకర్ జోన్ల ఏర్పాటు కూడా చేస్తారు. పదేళ్లలో వీటి నిర్వహణ కూడా ఆయా సంస్థలే చూస్తాయి. ఈ విధానం విజయవంతమైతే రాష్ట్రంలోని మిగిలిన నగరాలు, పట్టణాల్లోనూ పీపీపీ విధానంలో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో విపక్ష వైసీపీ మెడికల్ కాలేజీల్ని పీపీపీ విధానంలో చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తోంది. తాజాగా మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపిస్తూ కోటి సంతకాలు తీసుకుని గవర్నర్ కు సమర్పించింది. ఈ నేపథ్యంలో విజయవాడ, విశాఖలో రోడ్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం చర్చనీయాంశమైంది. తాజాగా సీఎం చంద్రబాబు కూడా రోడ్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నప్పుడు మెడికల్ కాలేజీల్ని కూడా అదే విధానంలో చేస్తే తప్పేముందని వైసీపీని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications