
సాయిరెడ్డికి చేజారిన హోదా - ప్రధాని సమక్షంలో : తెర వెనుక రఘురామ..!?
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డికి షాక్. రెండు రోజుల క్రితం ప్రకటన రాజ్యసభ వైస్‌చైర్మన్ ప్యానెల్ సభ్యుడుగా నియమించినట్లు రాజ్యసభ బులెటిన్‌లో ప్రకటించారు. దీనికి సాయిరెడ్డి కూడా స్పందించారు. ట్విట్టర్ వేదికగా రాజ్యసభ ఛైర్మన్ గా ధన్యవాదాలు చెప్పారు. సభ నిర్వహణలో పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా, తాజాగా రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రకటించిన వైస్ చైర్మన్ ప్యానెల్ సభ్యుల జాబితాలో ఆయన పేరు కనిపించలేదు.

తొలి జాబితాలో పేరు..తరువాత మిస్
రాజ్యసభ నూతన ఛైర్మన్ గా ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్‌ఖడ్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో వెంకయ్య నాయుడు రాజ్యసభ ఛైర్మన్ గా ఉన్న సమయంలో వైస్‌చైర్మన్ ప్యానెల్ సభ్యుడుగా విజయ సాయిరెడ్డి వ్యవహరించారు. ఇప్పుడు కొత్త ఛైర్మన్ తొలుత ప్రకటించిన జాబితాలో సాయిరెడ్డి పేరు ఉంది. దీని పైన సాయిరెడ్డి స్పందించారు. రాజ్యసభ ఛైర్మన్ ను ధన్యవాదాలు చెప్పారు. ఇక, పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తరువాత రాజ్యసభలో ఛైర్మన్ వైస్ చైర్మన్ ప్యానెల్ సభ్యుల జాబితా ప్రకటించారు. ప్రధాని మోదీ రాజ్యసభలో ఉన్న సమయంలోనే ఛైర్మన్ కొత్త ప్యానెల్ సభ్యుల జాబితాను ప్రకటించారు. తొలి జాబితాలో కనిపించిన సాయిరెడ్డి పేరు తుది జాబితాలో లేదు.

ప్రధాని సమక్షంలో జాబితా ప్రకటన
తొలుత విడుదలైన బులెటిన్‌లో భువనేశ్వర్ కలితా (బీజేపీ), ఎల్.హనుమంతయ్య (కాంగ్రెస్), తిరుచి శివ (డీఎంకే), సుఖేందు శేఖర్ రాయ్ (తృణమూల్ కాంగ్రెస్ ), డా.సస్మిత్ పాత్రా (బీజేడీ), సరోజ్ పాండే (బీజేపీ), సురేంద్రసింగ్ నాగర్(బీజేపీ), వి.విజయసాయిరెడ్డి(వైసీపీ) పేర్లున్నాయి. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సభలో రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ సభ్యుల జాబితాను పునర్వ్యస్థీకరించామని, వారి నియామకాలు ఈ నెల 5నుంచి అమలులోకి వస్తాయని ప్రకటిచారు. ఆయన ప్రకటించిన పేర్లలో విజయసాయిరెడ్డి తప్ప మిగతావారి పేర్లన్నీ ఉన్నాయి. దీంతో, అసలు అందరి పేర్లు యధాతధంగా ఉన్నా.. సాయిరెడ్డి పేరు లేకపోవటం వెనుక కారణాలు ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.

రఘురామ ఫిర్యాదు ప్రభావమా..!
ప్యానల్ జాబితాతో విజయ సాయిరెడ్డి పేరు మిస్ అవ్వటం రాజకీయంగా చర్చ మొదలైంది. బీజేపీ అగ్ర నేతలతో సాయిరెడ్డికి సత్సంబంధాలు ఉన్నాయి. అయితే, సాయిరెడ్డి పేరు మిస్ అవ్వటం సాంకేతికంగా జరిగిందా..లేక, తప్పించారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో మరో వాదన తెర మీదకు వచ్చిది. సాయిరెడ్డి పైన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజ్యసభ కొత్త ఛైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేసారు. సాయిరెడ్డి ఈ మధ్య కాలంలో అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టింగ్ లు చేస్తున్నారని..ఆయనను రాజ్యసభ కమిటీల నుంచి తప్పించాలని లిఖిత పూర్వకంగా కోరారు. ఇప్పుడు రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయం వెనుక ఈ ఫిర్యాదు ప్రభావితం చేసిందా అనే చర్చ జరుగుతోంది. కొంత కాలంగా సాయిరెడ్డి వర్సస్ రఘురామ ట్వీట్ల యుద్దం కొనసాగుతోంది. ఈ మొత్తం వ్యవహారం పైన విజయ సాయిరెడ్డి ఏ రకంగా స్పందిస్తారనేది చూడాలి.