వినోదోత్సవం: సింహాచలంలో భక్తులను ఆటపట్టించిన అర్చకులు
విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో బుధవారం వినోదోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సరదా సంఘటన చోటు చేసుకుంది.
సింహాచలం: విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో బుధవారం వినోదోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సరదా సంఘటన చోటు చేసుకుంది. వినోదోత్సవంలో భాగంగా అర్చకులు సరదాగా చేస్తే.. భక్తులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి తమ జన్మ ధన్యమయిందనుకున్నారు.
సింహాద్రి అప్పన్న ఆలయంలో దొంగలు పడ్డారని, స్వామి వారి ఉంగరం దోచుకెళ్లారంటూ ఆలయ అర్చకులు హడావుడి చేశారు. స్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తులను అనుమానించారు.

ఈ క్రమంలో కొందరు భక్తులను తాళ్లతో బంధించి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటనతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. సదరు భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అక్కడి పోలీసులను కోరారు.
అయితే, తాము దేవుని ఉంగరం తీయడం ఏమిటని కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి స్వామి వారి మేలి ముసుగు వస్త్రంలో ఉంగరం ఉందంటూ అర్చకులు చెప్పడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే, తమను అనుమానిస్తున్నారని ఆవేదన చెందిన భక్తులను ఆశ్చర్యపరుస్తూ.. కాసేపటికి అర్చకులు ఓ ప్రకటన చేశారు.
ఇదంతా అబద్ధమని, స్వామి వారికి నిర్వహించే వినోదోత్సవంలో భాగంగా ఈ నాటకం ఆడామని అర్చకులు చెప్పడంతో ఇందులో పాల్గొన్నందుకు తమ జన్మ ధన్యమయిందని భక్తులు ఆనందించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.












Click it and Unblock the Notifications