Visakhapatnam:అంబులెన్స్‌లోనే కన్ను మూసిన పసిబిడ్డ: కేజీహెచ్‌లో హృదయవిదారక దృశ్యం..!
విశాఖపట్నం: కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. కాస్త అజాగ్రత్తగా ఉన్నామో అంతే ...వెతికి మరీ కాటేస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అంతేకాదు మరణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.కరోనా పేషెంట్ మృతి చెందితే ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ఎదురయ్యే సమస్యలు మరో స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలోని ప్రభుత్వ హాస్పిటల్స్ ఆవరణలో హృదయవిదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. భగవంతుడు ఎందుకు కనికరం చూపడం లేదన్న ప్రశ్న ఈ సమయంలో చాలామందిలో రేకెత్తుతోంది. నిన్న శ్రీకాకుళంలో బైకుపై ఓ మహిళ మృతదేహంను స్మశాన వాటికకు తరలించిన ఘటన మరువక ముందే ఈ రోజు కరోనా సోకిన ఓ ఏడాదిన్నర వయసున్న చిన్నారి అంబులెన్స్‌లోనే చివరి శ్వాస వదలడం కలచివేసింది. ఏడాదిన్నర బిడ్డను కళ్లముందే పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

ఆక్సిజన్ అయిపోవడంతో చిన్నారి మృతి
విశాఖపట్నం అచ్యుతపురంకు చెందిన ఏడాదిన్నర చిన్నారి కరోనా సోకి మృతిచెందింది. పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులు అంబులెన్స్‌లో విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే బెడ్స్ ఖాళీ లేవని చెబుతూ ఆ చిన్నారిని చేర్చుకునేందుకు నిరాకరించింది అక్కడి సిబ్బంది . తల్లిదండ్రులు తమ బిడ్డను కాపాడాల్సిందిగా ఎంత వేడుకున్నప్పటికీ కనికరం చూపలేదు సిబ్బంది. అయితే ఓ వైపు సమయం గడిచే కొద్దీ పాప ఆయువు కూడా దగ్గర పడుతోంది. ఆ తల్లిదండ్రులకు ఎటు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. ఇక అంబులెన్స్‌లోనే ఉన్న ఆక్సిజన్‌తో గంటపాటు ఆ చిన్నారి గుండె కొట్టుకుంది. ఎప్పుడైతే అంబులెన్స్‌లోని ఆక్సిజన్ అయిపోయిందో ఆ చిన్నారి ఆయువు కూడా తీరిపోయింది.

తల్లిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు
కళ్లముందే ఏడాదిన్నర బిడ్డ చనిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది.బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కొన్ని రోజుల క్రితం ఎంతో సరదాగా ఆడుతూ పాడుతూ బోసినవ్వులతో కనిపించిన ఆ చిన్నారిని కనిపించని మహమ్మారి బలితీసుకుంది. కళ్ల ముందరే కానరాని లోకాలకు తరలిపోయిన చిన్నారిని చూసి తల్లి దండ్రులు హాస్పిటల్ ఆవరణలో కుప్పకూలిపోయారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

చిన్నారులు పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
ఇక సెకండ్ వేవ్‌లో కరోనా కాటుకు చిన్నారులు బలి అవుతున్నారు. గతేడాది వచ్చిన తొలి వేవ్ సందర్భంగా ఎక్కువగా వృద్ధులే మరణించారు. కానీ సెకండ్ వేవ్‌లో ఈ కొత్త స్ట్రెయిన్ చిన్నారులను కూడా వదలడం లేదు. అందుకే చిన్నారులను బయటకు పంపకూడదని వైద్యులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మ్యూటెంట్ చిన్నారులపై దాడి చేస్తే వారు తట్టుకోలేరని చెబుతున్నారు. అసలే ఆక్సిజన్ కొరతతో చాలామంది మృతి చెందుతున్నారని... చిన్నారులను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని హెచ్చరిస్తున్నారు. అనవసరంగా బయటకు పంపడం మంచిది కాదని.. మారాం చేసిన వారిపట్ల కఠినంగానే ఉండాలని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications