వరల్డ్ నెం.1 బ్యాటర్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు!
టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాడు. మైదానంలోకి అడుగుపెడితే బౌండరీల వర్షం కురిపించే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, తాజాగా ఒక అవాంఛనీయ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన రెండో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ తొలి బంతికే డకౌట్ కావడంతో ఈ అపకీర్తి అతడికి దక్కింది. సున్నా పరుగులకే వెనుతిరగడంతో, ఒకే క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా అభిషేక్ శర్మ ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో 49 పరుగులతో రాణించిన అభిషేక్ శర్మపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే రెండో మ్యాచ్‌లో జై ముంద్రా బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఏడాది అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడం ఇది తొమ్మిదోసారి. దీంతో అంతర్జాతీయ వేదికలపైనే కాకుండా, ఐపీఎల్ తరఫున ఆడుతున్న సమయంలోనూ డకౌట్ కావడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ప్రపంచ రికార్డును సమం చేసిన అభిషేక్
ఈ ఏడాదిలో అభిషేక్ శర్మ అంతర్జాతీయ మ్యాచుల్లో ఆరు సార్లు, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున మూడు సార్లు కలిపి మొత్తం తొమ్మిది సార్లు డకౌట్ అయ్యాడు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన రెండు కీలక మ్యాచ్‌లలో (ఎలిమినేటర్‌తో సహా) అతడు సున్నా పరుగులకే ఔటయ్యాడు. ఈ అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతున్న తరుణంలో ఈ తరహా వైఫల్యాలు చోటుచేసుకోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
టీ20 ఫార్మాట్‌లో ఒకే సంవత్సరంలో అత్యధిక సార్లు సున్నా పరుగులకే అవుటైన రికార్డులో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (2019), పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ (2024) సరసన తొమ్మిది డకౌట్లతో అభిషేక్ శర్మ చేరాడు. కేవలం అంతర్జాతీయ టీ20ల పరంగా చూస్తే, ఈ ఏడాది 15 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ ఏకంగా 6 సార్లు సున్నాకే ఔటయ్యాడు. భారత్ తరఫున ఒకే ఏడాదిలో ఇన్ని సార్లు డకౌట్ అయిన తొలి ఆటగాడిగా అభిషేక్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు.
ఈ జాబితాలో దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ ప్లేయర్ హర్షల్ గిబ్స్, వెస్టిండీస్ విద్వంసకర ఆటగాడు సునీల్ నరైన్ ఎనిమిదేసి సార్లు డకౌట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రధానంగా టీ20 ప్రపంచకప్‌లో అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ డకౌట్ కావడం చర్చనీయాంశమైంది. అయితే పవర్ ప్లే సమయంలో మొదటి బంతి నుంచే భారీ షాట్లకు ప్రయత్నించే క్రమంలోనే ఈ తరహా వికెట్ల పతనం ఎక్కువగా సంభవిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రారంభ ఓవర్లలో అత్యంత దూకుడుగా ఆడే శైలి కలిగిన ఓపెనర్లకు ఇటువంటి వైఫల్యాలు సహజమని కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే నిలకడ లేని బ్యాటింగ్ వల్ల జట్టుపై పడుతున్న ఒత్తిడిని గమనించి, ఆరంభంలో కాస్త సమయం తీసుకుని ఆడటం అభిషేక్ నేర్చుకోవాలని విశ్లేషిస్తున్నారు. త్వరలోనే తన బ్యాటింగ్ టెక్నిక్‌ను చక్కదిద్దుకుని మరింత పటిష్టంగా పునరాగమనం చేస్తాడని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications