విశాఖపట్నానికి పరిపాలనా రాజధాని ఖాయం: yv
విశాఖపట్నానికి పరిపాలనా రాజధాని తరలిరావడం ఖాయమని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు పార్టీ సమన్వయకర్త అయిన వైవీ జీవీఎంసీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైవీ విశాఖపట్నం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించిందని, వార్డులవారీగా నగరాన్ని అభివృద్ధి చేస్తుందని వెల్లడించారు. పరిపాలనా రాజధాని విశాఖకు తరలిరావడం ఖాయమని, న్యాయపరమైన చిక్కుల తర్వాత వస్తుందని, తేదీల గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం సరికాదని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.
వరద బాధితులకు ప్రభుత్వం తక్షణమే సాయం అందించిందన్నారు. ప్రతిపక్షాలు తమ రాజకీయ మనుగడ కోసం అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. బాధితులను ఎన్నివిధాలుగా ఆదుకోవాలో అన్నివిధాలుగా ప్రభుత్వం ఆదుకుందన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడు విజిట్ చేయాలి.. ఎప్పుడు సర్వే చేయాలి అనే విషయాలను ప్రతిపక్షాలు నిర్ధేశించలేవన్నారు. గాయని శ్రావణ భార్గవి వివాదం టీటీడీకి సంబంధం లేదన్నారు. చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటే పరిశీలిస్తామన్నారు.

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారికి ప్రియభక్తుడైన అన్నమయ్య పాటలకు అపచారం జరిగిందని, తొలి వాగ్గేయకారుడిగా ఆయన్ను మనందరం గౌరవించుకుంటున్నామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వైరల్ అయ్యేవాటిపై ఏం స్పందిస్తామన్నారు. అన్నమయ్య పేరుమీద జిల్లాను ఏర్పాటు చేసుకొని ఆయన్ను గౌరవించుకున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్ సూచనలకు అనుగుణంగా అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేసి తిరుమలకు మూడోమార్గాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.












Click it and Unblock the Notifications