త్వరలో విశాఖ-విజయవాడ బుల్లెట్ ట్రైన్..? రైల్వే మంత్రి సమాచారం..!
ఏపీలో కీలకమైన విభజన చట్టం హామీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ కల సాకారమవుతోంది. రేపటి నుంచి ఈ కొత్త రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా అందుబాటులోకి వస్తోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వేలో పలు స్టేషన్లు ఇందులో విలీనం కానున్నాయి. దీంతో విశాఖపట్నంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అదే సమయంలో మరో కీలక ప్రకటన కూడ వెలువడింది.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేంద్రమైన విశాఖపట్నం కేంద్రంగా విశాఖ-విజయవాడ బుల్లెట్ రైలు (Visakhapatnam-Vijayawada Bullet Train) కూడా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఇవాళ ఏపీ బీజేపీ ఛీఫ్ పీవీఎన్ మాధవ్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వీనీ వైష్ణవ్ తనకు సమాచారం ఇచ్చినట్లు మాధవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రైల్వే మంత్రి ప్రకటన ప్రకారం త్వరలోనే బుల్లెట్ రైలు ఈ రెండు నగరాల మధ్య అందుబాటులోకి వస్తుందన్నారు.

విశాఖపట్నం-విజయవాడ మధ్య ప్రస్తుత దూరం 350 కిలోమీటర్లు. హైస్పీడ్ రైల్వే కారిడార్ లో భాగంగా ఈ బుల్లెట్ ట్రైన్ ను అందుబాటులోకి తెస్తారు. ఈ బుల్లెట్ ట్రైన్ ను తొలుత గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడపాలని భావిస్తున్నారు. ఆ తర్వాత దీన్ని ఏకంగా గంటకు 600 కిలోమీటర్లకు పెంచాలని రైల్వే ప్రణాళికలు చేస్తోంది. కనీసం గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా గంటన్నరలోనే విశాఖ నుంచి విజయవాడకు చేరుకోవచ్చు. ఈ కారిడార్ ను భవిష్యత్తులో అమరావతి-విజయవాడ-విశాఖగా మారుస్తారు. అనంతరం హైదరాబాద్-అమరావతి-చెన్నై కారిడార్ కు అనుసంధానిస్తారు.












Click it and Unblock the Notifications