విశాఖ ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్ కలకలం ? 50 కోట్లు డిమాండ్- రక్షించిన పోలీసులు..!
విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని ఇవాళ గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఇవాళ ఉదయం వైజాగ్ ఎంపీ భార్య, కుమారుడిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు, అనంతరం వారితో ఫోన్ చేయించి ఆడిటర్ ను సైతం ఎత్తుకుపోయారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం తొలుత ఆడిటర్ జీవీ సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఎంపీ భార్య, కుమారుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుండగానే వారు కూడా సురక్షితంగా ఉన్నట్లు తేలింది.
ఇవాళ ఉదయం విశాఖలోని రుషికొండలో ఉన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడిని ముందుగా కిడ్నాప్ చేసిన అగంతకులు .. అనంతరం ఆడిటర్ కు వీరితో ఫోన్ చేయించి కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ జరిగిన సమయంలో ఎంపీ సత్యనారాయణ హైదరాబాద్ లో ఉన్నారు. ఆర్ధిక లావాదేవీల కారణంగానే ఈ కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఎంపీ భార్య, కుమారుడిని ఆగంతకులు ఎక్కడికి తీసుకెళ్లారనేది తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వీరిని విశాఖ-ఏలూరు జాతీయ రహదారి సమీపంలో గుర్తించినట్లు తెలుస్తోంది.

ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తాజాగా రుషికొండలో ఇల్లు కట్టుకుని అక్కడికి మారినట్లు తెలుస్తోంది. స్వతహాగా సినీ నిర్మాతతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా అయిన ఎంపీకి స్ధానికంగా పలు ఆర్ధిక లావాదేవీల వివాదాలు ఉన్నాయి. గతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈయనపై బహిరంగంగానే విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేయడం ద్వారా ఆయన్ను బెదిరించేందుకు కిడ్నాపర్లు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఎంపీ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసి వీరు రూ.50 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.
విశాఖ నుంచి 2019లో తొలిసారి వైసీపీ ఎంపీగా గెలిచిన ఎంవీవీ సత్యనారాయణకు స్ధానిక పార్టీ నేతలకూ మధ్య పొసగడం లేదు. గతంలో విశాఖ ఇన్ ఛార్జ్ గా ఉన్న విజయసాయిరెడ్డితో ఆయనకు పొసగని కారణంగానే ఆ తర్వాత జగన్ వైవీసుబ్బారెడ్డిని అక్కడికి పంపారు. అయితే స్ధానికంగా రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో చురుగ్గా ఉంటున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు గతంలోనూ బెదిరింపులు వచ్చాయి.












Click it and Unblock the Notifications