ఎన్నికల వేళ జగన్‌కు తలనొప్పిగా వివేకానంద రెడ్డి హత్య
ఎన్నికల వేళ దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మరోసారి తెర మీదకు వచ్చింది. సరిగ్గా అంటే.. ఐదేళ్ల క్రితం 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య జరిగిన సంగతి అందరికి తెలిసిన విషయమే. వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ..ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేకపోయారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత కుటుంబ సభ్యులే ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలపై వివేకానంద రెడ్డి కూతురు సునీత ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తూ సీబీఐకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. తాజాగా వివేకానంద రెడ్డి జీవితానికి సంబంధించి ఓ సినిమా కూడా తెరకెక్కింది. అసలు ఆయనపై ఒక సినిమా తీస్తున్నారనే విషయం ఎవరికి తెలియకపోవడం విశేషం. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. ఎటువంటి హడావిడి లేకుండా వివేకానంద రెడ్డి బయోపిక్ బయటకు వచ్చి..సినీ జనాలను ఆశ్చర్యపరించింది.

''వివేకం'' పేరిట తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు అన్న విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేశారు. అటు పేర్లు సైతం నిజజీవితానికి దగ్గరగా ఉండేలా చూసుకున్నారు. ట్రైలర్‌ను ఆకట్టుకునే రీతిలో ఉంది. అయితే ఈ సినిమాను చూడటానికి కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. ''వివేకం'' సినిమాను థియేటర్లకు కాకుండా నేరుగా ఓటీటీకి రిలీజ్ చేశారు. వివేక బయోపిక్ అనే వెబ్ సైట్‌లో ఈ సినిమాకు సంబంధించి పూర్తి నిడివి గల వీడియోని పెట్టడం జరిగింది. కేవలం 100 రూపాయిలు చెల్లించి పెయిడ్ స్క్రీన్ ద్వారా సినిమాను చూసే అవకాశం కల్పించారు.
ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా యాత్ర-2,వ్యూహం, శపథం వంటి సినిమాలు రాగ, వ్యతిరేకంగా రాజధాని ఫైల్స్ వంటి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా వివేకానంద రెడ్డి బయోపిక్ సైతం జగన్ పార్టీని టార్గెట్ చేసుకునే తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో అధికార పార్టీకి వివేకానంద రెడ్డి బయోపిక్ పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications