విశాఖ కేంద్రంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ : సీఎం సూచన- ప్రధాని అంగీకారం ..!!
సాగర తీరం విశాఖ మరో అరుదైన కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రపంచ దేశాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. జీ -20 సన్నాహక సదస్సు విశాఖ కేంద్రంగా నిర్వహించేందుకు నిర్ణయం జరిగింది. జీ-20 అధ్యక్ష బాధ్యతలు ఈ సారి భారత్ కు దక్కింది. జీ -20 నిర్వహణ పైన ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో సీఎం జగన్ తాము జీ-20 సన్నాహక సదస్సు విశాఖ కేంద్రంగా నిర్వహణకు సిద్దంగా ఉన్నామని ప్రతిపాదించారు. కేంద్రం విశాఖ కేంద్రంగా ఈ సదస్సుకు నిర్ణయించింది. మార్చి 28, 29 తేదీల్లో ఈ అంతర్జాతీయ సదస్సు జరగనుంది.

40 దేశాల నుంచి ప్రతినిధులు రాక..
విశాఖ నగరంలో మార్చి 28, 29 తేదీల్లో జీ -20 సన్నాహక సదస్సు జరగనుంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారులకు బాధ్యతలు అప్పగించింది. నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటైంది. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ నోడల్ అధికారిగా వ్యవహరించనున్నారు. జరగనున్నాయి. రెండ్రోజుల పాటు జరిగే ఈ జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు.
300 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు. జీ-20 దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు.. రాయబారులతో పాటుగా కేంద్ర మంత్రులు ఈ సదస్సులో పాల్గొంటారు. వారికి కావాల్సిన వసతి.. సదస్సు నిర్వహణ ఏర్పాట్ల పైన అధికారుల టీం కసరత్తు ప్రారంభించింది.

విశాఖ కేంద్రంగా సీఎం జగన్ ఆతిథ్యం..
జీ-20 సదస్సు నిర్వహణకు సంబంధించిన ఈ సన్నాహక సదస్సు తమ రాష్ట్రంలో నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. దేశ వ్యాప్తంగా 56 నగరాల్లో 200 సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేసింది. అందులో ఏపీ నుంచి విశాఖకు అవకాశం దక్కింది. అతిధుల కోసం స్టార్ హోటళ్లలో 300 గదులను బుక్ చేస్తున్నారు.
మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ ఈ సదస్సు కు సంబంధించి అధికారుల టీంకు నాయకత్వం వహిస్తున్నారు. సదస్సులె సీఎం జగన్ తో సహా కేంద్ర మంత్రులు..కేంద్ర ఉన్నతాధికారులు.. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. డిజిటల్ ఇండియా..హరిత అభివృద్ధి తో పాటుగా మహిళా సాధికారత.. యువత కు అవకాశాలు.. రైతు అంశాలతో సదస్సులు నిర్వహణకు నిర్ణయించారు.

విశాఖ కేంద్రంగా వరుసగా గ్లోబల్ మీట్స్
వివిధ దేశాల నుంచి జీ -20 సదస్సుకు కోసం వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని సుందరీకరణకు నిర్ణయించారు. మార్చి 3,4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ కు నిర్ణయించారు. ఇప్పటికే ఈ సదస్సుకు అంతర్జాతీయ ప్రముఖులను రాష్ట్రం ఆహ్వానించింది. కీలకమైన 12 రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే విధంగా సమావేశాలన నిర్వహిస్తున్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మార్చి తొలి వారంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్.. చివరి వారంలో జీ 20 సన్నాహక సదస్సుతో విశాఖ నగరం అంతర్జాతీయ - జాతీయ ప్రముఖలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దం అవుతోంది.












Click it and Unblock the Notifications