వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం రూ.2500 కోట్లు ఇవ్వలేదా ? కార్మిక నేతలతో సీఎండీ...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ నడిచేందుకు అవసరమైన ముడి సరుకు కొరత నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. తాజాగా ముడిసరుకు కొనుగోలు, ఇతర అవసరాల కోసం రూ.2500 కోట్లు చెల్లించినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే నిన్న ఢిల్లీలో ఉక్కుమంత్రిత్వశాఖ అధికారులతో చర్చల్లో పాల్గొన్న వైజాగ్ స్టీల్ సీఎండీ అరుణ్ కాంత్ బాగ్చీ ఇవాళ విశాఖకు వచ్చి కార్మిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు.వారికి దీనిపై క్లారిటీ ఇచ్చేశారు.
కార్మిక సంఘాల భేటీలో స్టీల్ ప్లాంట్ సీఎండీ అరుణ్ కాంత్ బాగ్చీ సంచలన విషయాలు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ కు రూ. 2500 కోట్లు నిధులు విడుదల చేశారనేది అవాస్తవమని ఆయన తేల్చిచెప్పేశారు. నిధుల విడుదల అయినట్టు తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఢిల్లీలో ఉక్కు శాఖ అధికారులతో జరిగిన చర్చల సారాంశం కూడా తాను వెల్లడించలేనని ఆయన కార్మిక నేతలకు తేల్చిచెప్పేశారు. దీంతో కార్మిక నేతలు నిరాశకు గురయ్యారు.

మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను మాత్రమే అమలు చేస్తున్నామని సీఎండీ బాగ్చీ వెల్లడించారు. ప్రైవేటీకరణతో పాటు ఇతర అంశాల్లో కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో తమ పాత్రేమీ ఉండబోదన్నారు. దీంతో స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు మూడేళ్లుగా నిరసనలు చేస్తున్న కార్మిక సంఘాలకు ఇప్పుడు తాడో పేడో తేల్చుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దీనిపై కేంద్రం నుంచి మరింత క్లారిటీ కోసం వారు ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications