విశాఖ, బెజవాడ మెట్రో బాధ్యత డిఎంఆర్సీకి, విజయవాడపై నేను చూసుకుంటా.. వెంకయ్య భరోసా
కోల్‌కతా/న్యూఢిల్లీ: విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రోరైలు వ్యవస్థల నిర్మాణ బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ)కు అప్పగించినట్లు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖ మెట్రో సమగ్ర పథక నివేదిక(డీపీఆర్)ను డీఎంఆర్‌సీ శనివారం అందజేసిందన్నారు.
త్వరలోనే దీనికి మంత్రివర్గ ఆమోదం లభిస్తుందన్నారు. విజయవాడ డీపీఆర్ ఇప్పటికే ఆమోదం పొందిందని చెప్పారు. 2018 నాటికి విజయవాడలో రెండు కారిడార్‌లు, విశాఖలో సాధ్యమైనంతవరకు పనులు పూర్తిచేయాలని మెట్రో సలహాదారు శ్రీధరన్‌కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
శనివారం విజయవాడలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు, మెట్రో సలహాదారు శ్రీధరన్, డీఎంఆర్సీ ఎండీ మంగూసింగ్.. ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, మంత్రులు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు.

అనంతరం విలేకరులతో మాట్లాడారు. విజయవాడతో పాటు నూతన రాజధాని అమరావతి, గుంటూరుల్లో మెట్రో నిర్మాణంపై పరిశీలించాలని కోరామని, ప్రస్తుతానికి ఆ అవసరం లేదని సలహాదారు శ్రీధరన్ అభిప్రాయపడ్డారని సీఎం చంద్రబాబు చెప్పారు.
దీంతో హైస్పీడ్ ఇంటర్నల్ ట్రైన్ ఏర్పాటుకు నివేదిక రూపొందించాలని కోరామన్నారు. మెట్రో నిర్మాణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ పర్పజ్ వెహికల్(ఎస్‌పివి) ఏర్పాటు చేసి ప్రభుత్వ నిధులు 40 శాతం, మార్కెట్ రుణాలు 60 శాతం సేకరించాల్సి ఉందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రాయితీ ఇవ్వనున్నాయని చెప్పారు. విభజన చట్టం ప్రకారం రెండు మెట్రోలను చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు. విభజన బిల్లులో చెప్పినట్లుగా విజయవాడ, విశాఖపట్నంల్లో మెట్రో రైలు వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని కేంద్రమంత్రి వెంకయ్య అన్నారు.
ఈ రెండు నగరాలపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోందన్నారు. నగర జనాభా 20 లక్షలు మించితేనే మెట్రో ఏర్పాటుకు అనుమతి వస్తుందని 2011 గణాంకాల ప్రకారం ఆ మేరకు జనాభా లేనప్పటికీ విశాఖలో ఏడాదికి 2.85 లక్షల జనాభా పెరుగుతున్నందున మెట్రో ఏర్పాటుకు అర్హత సాధించి ఉంటుందన్నారు.
విజయవాడ నూతన రాజధాని ప్రాంతమైనందున కేంద్రం ముందుకు వచ్చిందని చెప్పారు. కాగా, గతంలో జనాభా అనుకున్న విధంగా లేదని విజయవాడ మెట్రోకు కేంద్రం వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు, కేంద్రం విజయవాడ మెట్రోకు కూడా మొగ్గు చూపింది.
ఇంకా, వెంకయ్య మాట్లాడుతూ... ఈ రెండు ప్రాజెక్టులకు ఆర్థికంగా సానుకూల పరిస్థితులు లేవని, తక్కువ వడ్డీతో విదేశీ రుణం తీసుకుని తిరిగి చెల్లిస్తామని తెలిపారు.
విజయవాడ - నూతన రాజధాని అమరావతి, పాత అమరావతి, గుంటూరు మధ్య హైస్పీడ్ రైలు ఏర్పాటుపై ఆలోచిస్తున్నామని, రైల్వే మంత్రిత్వ శాఖకు ఈ బాధ్యత అప్పగిస్తామని చెప్పారు. విజయవాడ మెట్రోపై ఆర్థిక శాఖ కొర్రీలు వేసిన విషయాన్ని గుర్తుచేయగా ఆ అంశాన్ని తమ మంత్రిత్వశాఖ చూసుకుంటుందని వెంకయ్య భరోసా ఇచ్చారు.
నూతన రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగులకు నివాసాలను రూ.500 కోట్లతో నిర్మిస్తామన్నారు. ఇందుకు 58 ఎకరాలు అవసరమన్నారు. ఆకర్షణీయ నగరాల జాబితాలో విజయవాడ లేకపోవడంపై విలేకరులు ప్రశ్నించగా... తాను, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణలు ఇద్దరూ నెల్లూరు జిల్లాకు చెందిన వారైనప్పటికీ నెల్లూరు ఆకర్షణీయ నగరంగా ఎంపిక కాలేదని చెప్పారు.
ఆర్థిక సాయం యూపీఏ కంటే ఎక్కువ
రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించడంలో ఎన్డీయే ప్రభుత్వమే అన్ని విధాలా మిన్నగా ఉందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శనివారం అన్నారు. కోల్‌కతాలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.
2005-2014 మధ్య జేఎన్ఎన్‌యూఆర్ఎం పథకం కింద యూపీఏ ప్రభుత్వం రూ.36వేల కోట్లు ఇస్తే, రాబోయే అయిదారేళ్లలోనే తాము రాష్ట్రాలకు రూ.3 లక్షళ కోట్లు ఇవ్వబోతున్నామని చెప్పారు. దేశాన్ని సమూలంగా మార్చాలని కేంద్రం భావిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications