వాలంటీర్లను కొనసాగిస్తారా ? చంద్రబాబుకు బాలినేని సవాల్ ! రాజీనామాలొద్దన్న జేసీ..
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య వాలంటీర్ల కేంద్రంగా సాగుతున్న పొలిటికల్ వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ముఖ్యంగా వాలంటీర్లను ఎన్నికల విధులతో పాటు పెన్షన్లకూ దూరం పెడుతూ ఈసీ తీసుకున్న నిర్ణయంతో వైసీపీకి షాకులు తగిలాయి. దీంతో వెంటనే వారితో రాజీనామాలు చేయించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత టీడీపీ వాలంటీర్లకు కొత్త హామీలు ఇవ్వడం మొదలుపెట్టడంతో ఆత్మరక్షణలో పడిన వైసీపీ.. ఇప్పుడు వారి కొనసాగింపుపై టీడీపీని హామీ కోరుతోంది.
రాష్ట్రంలో ఈసీ ఆదేశాల తర్వాత ఓవైపు వాలంటీర్లు రాజీనామాలు చేస్తుండగా.. మరోవైపు వారికి టీడీపీ హామీల పర్వం కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వాలంటీర్లను రాజీనామాలు చేయొద్దంటూ రాయలసీమ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇచ్చే పారితోషకం 10 వేలకు పెంచుతామని, వారికి అన్ని విధాలా భద్రత కల్పిస్తామని తెలిపారు. కాబట్టి వైసీపీ ట్రాప్ లో పడి రాజీనామాలు చేయొద్దని సూచించారు.

మరోవైపు వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వాలంటీర్లకు టీడీపీ ఇస్తున్న హామీలపై స్పందిస్తూ.. ఇప్పుడున్న వాలంటీర్లు అందరినీ కొనసాగిస్తామని హామీ ఇవ్వాలంటూ సవాల్ విసిరారు. వాలంటీర్ల విషయంలో టీడీపీ రోజుకో మాట మాట్లాడుతోందని, వారిని తప్పించాలని ఈసీని కోరిన టీడీపీ.. ఇప్పుడు వారికి జీతాలు పెంచుతామంటూ హామీలు ఇస్తోందని ఆక్షేపించారు. ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకే చంద్రబాబు ఇలాంటి హామీలు ఇస్తున్నారని బాలినేని ఆరోపించారు.












Click it and Unblock the Notifications