వీడియో: వైఎస్ అవినాష్ రెడ్డిని తోసేశారా? క్లారిటీ ఏంటీ?
YS Avinash Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో ఉన్నారు. మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. శనివారమే ఆయన ఇడుపులపాయకు చేరుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత నియోజకవర్గానికి వెళ్లడం ఇదే తొలిసారి.
తన పర్యటనలో భాగంగా వైఎస్ జగన్.. శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన వాళ్లే కాకుండా కడప, అన్నమయ్య రాయచోటి, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజా దర్బార్‌కు తరలివచ్చారు. వందల సంఖ్యలో అభిమానులు తరలిరావడం వల్ల ఇడుపులపాయ క్రిక్కిరిసిపోయింది.

జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తోన్న సమయంలో రాళ్లదాడి చోటు చేసుకున్నట్లు మొదట్లో వార్తలొచ్చాయి. జగన్‌పై ఆగ్రహంతో ఆయన అభిమానులే రాళ్లు విసిరారని, వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ కథనాలు వెలువడ్డాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ అయ్యాయి.
దీన్ని పోలీసులు తోసిపుచ్చారు. రాళ్లదాడి జరగలేదంటూ స్పష్టత ఇచ్చారు. పార్టీ కార్యాలయం వద్ద జగన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి నినాదాలు చేయలేదని స్పష్టం చేశారు. జగన్‌ను చూడడానికి వందల సంఖ్యలో ప్రజలు తరలిరావడం వల్ల తోపులాట జరిగిందని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు.
అదే సమయంలో.. ప్రజా దర్బార్‌లో పాల్గొనడానికి వచ్చిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డిని పక్కకు తోసివేశారనే ప్రచారం కూడా విస్తృతంగా సాగింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో సర్కులేట్ అయింది. టీడీపీ గ్రూపుల్లోనూ చక్కర్లు కొట్టింది. రాయలసీమలో పార్టీ ఓటమికి వైఎస్ అవినాష్ రెడ్డి కారకుడంటూ జగన్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ రాసుకొచ్చారు.
దీనిపై వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం స్పష్టతను ఇచ్చింది. జగన్‌ను చూడటానికి పెద్ద ఎత్తున తరలిరావడం వల్ల తోపులాట చోటు చేసుకుందని గుర్తు చేసింది. ఆ సమయంలో అవినాష్ రెడ్డి కింద పడకుండా ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బంది పట్టుకున్నారని వివరించింది. ఒక వర్గానికి చెందిన మీడియా చేస్తోన్న ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరింది.












Click it and Unblock the Notifications