అప్పులెన్ని ఉన్నాయో ఇంకా నాకే తెలీదు: పెత్తందారులం కాదు.. సేవకులం
Chandrababu Naidu: రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం.. పండగ వాతావరణంలో ఆరంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన తొలి కార్యక్రమం, అమలు చేసిన తొలి హామీ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రారంభించారు. రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో కొద్దిసేపటి కిందటే స్వయంగా అర్హులకు వాళ్ల ఇళ్ల వద్దే పింఛన్ మొత్తాన్ని అందజేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. మేళ తాళాలు, డప్పు చప్పుళ్లతో పెనుమాకలో కోలాహలం నెలకొంది.

పింఛన్ల పంపిణీ అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు చంద్రబాబు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలి సభను తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేశామని అన్నారు. ఎప్పుడూ ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చిందని, మిత్రపక్షాలను పోటీలో నిలబెట్టినా గెలిచామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అత్యధిక మెజారిటీని సాధించిన స్థానాల్లో ఇదీ ఒకటి అంటూ చెప్పారు. గాజువాకలో 95 వేలు, భీమిలీలో 94 వేలు, మంగళగిరిలో 91 వేల మెజారిటీని సాధించామని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా, గెలవాలనే తపనతో మంగళగిరి నుంచే నారా లోకేష్ పోటీ చేశారని పేర్కొన్నారు.
తమ రాజకీయం లబ్ది కోసం, 33 మంది వృద్ధులని చంపేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. గ్రామ సచివాలయ ఉద్యోగులని ఉపయోగించుకోమని చెప్పినా, కుదరదు అన్నాడు.
— Telugu Desam Party (@JaiTDP) July 1, 2024
అందుకే ఆ పట్టుదలతోనే, నేడు ఒకే రోజు సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ చేసి చూపిస్తున్నాం.#PensionsPandugaInAP #NTRBharosaPension… pic.twitter.com/4DXUIYsuVv
గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని, ఖాజానా ఖాళీ చేసిందని చంద్రబాబు విమర్శించారు. అప్పులు ఎన్ని ఉన్నాయో ఇంకా తనకే తెలియదని వ్యాఖ్యానించారు. దొరికిన అన్ని చోట్లా అప్పులు చేశారని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు.
మళ్లీ ఆ దుర్మార్గుడు (వైఎస్ జగన్) వస్తే ఏం జరుగుతుందోననే భయంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రావట్లేదని చంద్రబాబు అన్నారు. గత అయిదు సంవత్సరాల్లో రాష్ట్రం బ్రాండ్ దెబ్బతిన్నదని, దాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ముఖ్యమంత్రిగా తాను పనికి రాను అని ఒక వ్యక్తి గత అయిదు సంవత్సరాల్లో నిరూపించుకున్నాడని, ఆ వ్యక్తి పేరు పలకడానికి కూడా తాను ఇష్టపడట్లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రి ఎలా పని చేయాలనే దానికి తాను ఆదర్శంగా ఉండేలా పరిపాలన సాగిస్తానంటూ హామీ ఇచ్చారు.
ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికిరాడని గత పాలకుడి తీరు పై ప్రజలు తీర్పు ఇచ్చారు.
— Telugu Desam Party (@JaiTDP) July 1, 2024
ప్రజల అభీష్టం మేరకు, ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనేది ఇప్పుడు నేను నిరూపించాలి#PensionsPandugaInAP #NTRBharosaPension #NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/Ptfh5rNZJy
మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైందని, ఇదొక చరిత్ర అంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు. ఇన్ని తక్కవ సీట్లు ఎప్పుడూ ఎవరికి రాలేదని, అది ప్రజల నిర్ణయమని పేర్కొన్నారు. ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ అందరూ సేవకులుగా ఉంటారని, తాము పెత్తందారులం కాదని అన్నారు. ఎలాంటి ఆడంబరాల జోలికి వెళ్లకుండా సింపుల్‌గా ఉంటామని చెప్పారు.
పరిపాలన అనేది ప్రజలకు సేవ చేయడానికే తప్ప వారిపై ఆధిపత్యం, పెత్తనం చలాయించడానికి కాదని అన్నారు. 4,000 రూపాయల పింఛన్ ఇవ్వడం చేతకాదని చెప్పిన అధికార యంత్రాంగం ద్వారానే.. మేము చెయ్యగలుగుతామని చేసి చూపిస్తున్నామని చంద్రబాబు వివరించారు.












Click it and Unblock the Notifications