చెప్పుకోలేకపోయామని పురంధేశ్వరి, పెదవి విప్పని చిరు
న్యూఢిల్లీ: సమైక్యాంధ్ర కోసం తాము చేస్తున్న కృషిని చెప్పుకోలేకపోయామని కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రితో భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆమె తమ ఆందోళనను, ఆవేదనను వ్యక్తపరిచారు.
సమైక్యాంధ్ర కోసం తాము చేస్తున్న కృషిని మీడియాలో సరిగా తీసుకెళ్లలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. తాము ఢిల్లీలో నిజాయితీ, మనస్సాక్షిగా బాధ్యతలు నిర్వర్తించామని, ప్రజాభిప్రాయాన్ని అధిష్టానానికి గట్టిగా చెప్పామన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అవకాశం ఇవ్వడం వల్లే తాము మంత్రివర్గంలో ఉన్నామని చెప్పారు.

తమ రాజీనామాలు పార్టీ పట్ల కానీ, నాయకుల పట్ల కానీ కాదన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే రాజీనామా చేసినట్లు చెప్పారు. తాము ప్రజల్లోకి వెళ్లాలంటే తక్షణం రాజీనామా చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కూడా చెప్పిన విషయం తెలిసిందే. అదే సమయంలో సీమాంధ్రకు చెందిన తొమ్మిది మంది మంత్రుల్లో నలుగురే రాజీనామా చేయడం వల్ల మెజార్టీ విభజనకు అనకూలంగా ఉన్నట్లు అనిపించడం లేదా అన్న ప్రశ్నకు చిరు సమాధానం చెప్పలేదు.
మరోవైపు సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో భేటీ అయిన కేంద్రమంత్రులు పళ్లం రాజు, చిరంజీవి, పురంధేశ్వరి, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిలు తాము మోసపోయామని, కేంద్రమే తమను దోషిగా నిలబెట్టిందని మొర పెట్టుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications