శ్రీధర్‌కు వద్దని చెప్పా: బొత్స, అధిష్టానానికి చెప్పే: ఆనం
హైదరాబాద్: రాజీనామా చేయవద్దని తాను శ్రీధర్ బాబుకు చెప్పానని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం అన్నారు. శాసన సభ వ్యవహారాల మంత్రిగా ఎవరున్నా సీమాంధ్ర, తెలంగాణ అంశాలతో సంబంధం లేదన్నారు. శాసన సభలో సమైక్య తీర్మానం ఎప్పుడో చేసి ఉండాల్సిందని, ఇప్పుడు చేసినా అభ్యంతరం లేదన్నారు.
శాఖను మార్చడం ద్వారా ఒకరి ఇమేజ్ పెంచడం, మరొకరి ఇమేజ్ తగ్గించడం అనేది ఉండదన్నారు. శాఖను మార్చే అధికారం ముఖ్యమంత్రికి ఉందన్నారు. శ్రీధర్, కిరణ్‌ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ అన్న టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. మద్యం ధరలు పదే పదే పెంచడం సరికాదని తాను ఎక్సైజ్ శాఖ కార్యదర్శికి చెప్పానని బొత్స తెలిపారు.

హైకమాండ్ చెప్పిందే చేస్తున్నాం: ఆనం
తాము తమ పార్టీ అధిష్టానం చెప్పిందే చేస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామీణ శాసన సభ్యులు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. శ్రీధర్ బాబు శాఖ మార్పు సహజమైన చర్య అన్నారు. ఏదో అవుతుందని భావించడం సరికాదన్నారు.
తామేం చేసినా అధిష్టానానికి చెబుతున్నామన్నారు. సభ సజావుగా సాగేలా చూడాలని తమ పార్టీ అధిష్టానం ఆదేశించిందన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన తమ అభిప్రాయాలను తాము సభలో స్వేచ్ఛగా చెబుతామన్నారు. ఓటింగు ఉంటే తాము తెలంగాణ బిల్లును ఓడిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications