Telangana exit polls 2023: తొలి హామీ ఇచ్చిన నారా లోకేష్- ఆ ధీమాతో
Nara Lokesh: తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ నెల 3వ తేదీన నిర్వహించబోయే ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడే ఫలితాలు ఎలా ఉండొచ్చనే విషయంపై తమ అంచనాలను వ్యక్తం చేశాయి. ఒకట్రెండు మినహా దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాయి. భారీ మెజారిటీని అందించాయి.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఎంత వరకు నిజం అవుతాయనేది ఈ నెల 3వ తేదీన తేలిపోతుంది. తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ఆ రోజే ఓట్లను లెక్కిస్తారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, రాజస్థాన్‌లో బీజేపీ, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్.. ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలు అటు ఏపీలో తెలుగుదేశం పార్టీలో ధీమాను అమాంతం పంచేశాయి. తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉంటుందని, అది తమ విజయానికి బాటలు వేస్తుందని అంచనా వేస్తోంది టీడీపీ.
లక్షలాది మంది ఏపీ ఓటర్లు తెలంగాణలో నివసిస్తోన్నారు. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో వారి సంఖ్య అధికం. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేయగలిగే సంఖ్యలో ఉన్నారు. అక్కడున్న ఏపీ వాసుల మనోగతం.. ఈ ఎన్నికలతో తేలిపోయిందని, ఇక ఇక్కడ కూడా తెలంగాణ తరహా ఫలితాలే వస్తాయని టీడీపీ బలంగా నమ్ముతోంది.
ఏపీలో తాము అనుకున్నంత బలహీనంగా లేమని, ఈ ఎన్నికలు రుజువు చేసినట్టు భావిస్తోంది. అది కాస్తా టీడీపీ అగ్రనాయకత్వంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినట్టయింది. ఇకపై ఏపీ రాజకీయాల్లో మరింత చురుగ్గా వ్యవహరించాలని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటైతే.. అక్కడి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయని నమ్ముతోంది.
ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తి రేపుతోంది. 2024లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తామే అధికారంలోకి రాబోతోన్నామనే సంకేతాలను పంపించారు ఈ ట్వీట్ ద్వారా. ఈ క్రమంలో తొలి హామీని సైతం ఇచ్చారు.
2024 మార్చి/ఏప్రిల్ నాటికి ఏపీలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఆ వెంటనే తిరుపతి లడ్డూ ప్రసాదం నాణ్యతను పెంచుతామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి లడ్డూ సమస్యను పరిష్కరించాలంటూ ఓ ఎక్స్ యూజర్ చేసిన ట్వీట్‌కు ఆయన రిప్లై ఇచ్చారు. తిరుపతి లడ్డూ నాణ్యత తగ్గిందని, పటిక బెల్లం తింటున్నట్లు ఉందంటూ ఆ యూజర్ వాపోయాడు.












Click it and Unblock the Notifications