Rain alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు
అమరావతి: తెలుగు రాష్ట్రాలు ఇటీవల కురిసిన భారీ వర్షాల బీభత్సం నుంచి తేరుకోకముందే మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రజలను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్ తోపాటు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు, దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరోసారి చురుగ్గా కదులుతుండటంతోనే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
బంగాళాఖాతం నుంచి వివిధ ప్రాంతాలపై ఉపరితల ద్రోణి కూడా ఆవరించి ఉండటంతో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజస్థాన్, అస్సాం, మేఘాలయ, మధ్యప్రదేశ్ తోపాటు హిమాలయ పర్వత ప్రాంతాల్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజులపాటు అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
విజయవాడలోనూ ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరదనీరు చేరింది. భారీ వర్షాలు, వరదలతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక కాలనీల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.












Click it and Unblock the Notifications