రెండో వేసవి, మండుతున్న ఎండలు - ఉక్కపోత.. అప్పటి వరకు తప్పదు..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. వేసవి పూర్తయినా రెండో వేసవి మొదలైందా అన్నట్లుగా పరిస్థితి మారింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉక్కపోతతో మళ్లీ అందరూ ఏసీలు ఆన్ చేయక తప్పటం లేదు. వడగాల్పులు కొనసాగుతున్నాయి. లోటు వర్ష పాతం తో పాటుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. దీని పైన వాతావరణ అధికారులు స్పష్టత ఇస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎండ తీవ్రత పెరుగుతోంది. నాలుగు రోజులగా పెరుగతున్న ఎండలు ఇప్పుడు వేసవిని తలపిస్తున్నాయి. పలు జిల్లాల్లో ఉక్కపోతలు.. వడగాల్పులు కొనసాగుతున్నాయి. సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్ల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రతీ ఏటా సాధారణంగా జూన్ నెల నుంచి వానలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ వానలు లేవు. దీంతో వానలు లేకపోవడంతో పాటు ఉక్కపోతతో జనం ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్తు వినియోగం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగింది. కొన్ని చోట్ల మోస్తరు వానలు, మరికొన్ని చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. మరొకవైపు వాయవ్య దిశ నుంచి గాలులు వీస్తుండటంతో ఏపీలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వేసవి తరహా ఉష్ణోగ్రతలు నమోదు
కాగా, తిరుపతిలో 41, జంగమహేశ్వరపురంలో 40.5, బాపట్లలో 40.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు, మూడు రోజులు కోస్తాలో పలుచోట్ల వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రంలోని ఎక్కువ ప్రాంతాల్లో ఎండ తీవ్రత, వర్షాభావం కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈనెల మూడో వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో వర్షాభావం ఉంటుందని అధికారులు వెల్లడించారు. మరొక వైపు నైరుతి రుతు పవనాలు, ఉపరితల ద్రోణి నేపథ్యంలో తెలంగాణలో అక్కడక్కడ వానలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications