హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.. మొత్తం 76 ప్రాంతాలపై మార్పులు
హైదరాబాద్ మహానగరంలో శాంతి భద్రత, పోలీస్ వ్యవస్థ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ సరిహద్దులను రేషనలైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ పేరుతో జీఓను విడుదల చేసింది. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో జోన్లు, డివిజన్లు, పోలీస్‌స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 76 ప్రాంతాలపై మార్పులు చేర్పులు చేసింది. కొన్ని పోలీస్‌స్టేషన్ల పరిధులు ఇతర జోన్లు, డివిజన్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మార్కెట్ పీఎస్ పరిధిలోని పలు ప్రాంతాలు మల్కాజిగిరి కమిషనరేట్ కు బదిలీ అయ్యాయి.
అటు మహేశ్వరం, శంషాబాద్, సైబరాబాద్ పరిధుల్లోనూ మార్పులు జరిగాయి. ఆర్‌జీఐఏ పీఎస్ పేరును శంషాబాద్ పీఎస్ గా మార్చారు. అలాగే శంషాబాద్ వార్డు 118, కొత్వాల్ గూడ వార్డు 119 పరిధిలోని గ్రామాలను ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోకి విలీనం చేశారు. శంషాబాద్ డివిజన్ లో ఆర్ జీఐఏ పీఎస్, శంషాబాద్ పీఎస్ ల పునర్వ్యవస్థీకరణ జరిగింది. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మార్పులు చేశారు. అటు అబ్దుల్లాపూర్ మెట్, మీర్ పేట్ ప్రాంతాల పోలీస్ పరిధుల్లో మార్పులు జరిగాయి. ఇక జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సనత్ నగర్ ప్రాంతాల్లోనూ పరిధుల పునర్విభజన జరిగింది.

మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీ స్టేషన్ పరిధి యథాతథంగా కొనసాగుతూనే, యూనివర్సిటీ క్యాంపస్ భూభాగమంతా సంపూర్ణంగా ఓయూ పీఎస్ పరిధి కిందకే వచ్చేలా జీఓలో ప్రభుత్వం వెల్లడించింది. అలాగే ట్రాఫిక్ పోలీస్ పరిధిలోనూ జోన్లు, డివిజన్ల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఉమెన్ సేఫ్టీ వింగ్ పరిధిలోనూ కొత్తగా జోన్ల కేటాయింపు జరిగింది. అటు జోనల్ సైబర్ సెల్ పరిధులను కూడా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు జీఓ నెం 84 ద్వారా పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక ఈ నూతన పునర్వ్యవస్థీకరణ నోటిఫికేషన్ ను తెలంగాణ అధికారిక గెజిట్ ప్రత్యేక సంచిక లో ప్రచురిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.












Click it and Unblock the Notifications
