ములాఖత్ లో చంద్రబాబు-పవన్ ఏం మాట్లాడుకున్నారు ? ఆశ్చర్యం నుంచి ప్రకటన దాకా..
నిన్న రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు.సీఐడీ అరెస్టు చేసిన తర్వాత ఏసీబీ కోర్టు రిమాండ్ కు పంపిన చంద్రబాబును అప్పటివరకూ కుటుంబ సభ్యులు, ఆయన లాయర్లు మాత్రమే పరామర్శించగా.. నిన్న మాత్రం పవన్ కళ్యాణ్ ను తీసుకుని బాలకృష్ణ, లోకేష్ ఇద్దరూ జైలుకు వెళ్లారు.అక్కడ దాదాపు 40 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాట్లాడుకున్నారు. ఇందులో ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది.
జైల్లో చంద్రబాబుతో ములాఖత్ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన అంశాల ఆధారంగానే ఆయన తర్వాత బయటికి వచ్చి పొత్తుపై కీలక ప్రకటన చేశారు. దీంతో పవన్ చంద్రబాబుతో మాట్లాడిన అంశాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం టీడీపీతో పొత్తుపై జనసేనాని చంద్రబాబుతో కీలక చర్చ జరిపినట్లు తెలుస్తోంది. జైల్లోకి వచ్చీ రాగానే చంద్రబాబు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న పవన్.. ఆ తర్వాత వెంటనే విషయంలోకి వెళ్లిపోయారు.

ముఖ్యంగా టీడీపీ-జనసేన పొత్తుపై బహిరంగ ప్రకటన చేయాల్సిన అవసరాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అప్పటికప్పుడే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు కూడా దీనికి సరేననడంతో పవన్ కళ్యాణ్ బయటికి రాగానే ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో చర్చలో పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులు, చంద్రబాబు అరెస్టు పరిణామాలు, తెలంగాణ సరిహద్దుల్లో తనను అడ్డుకున్న తీరుపై ప్రధానంగా మాట్లాడినట్లు సమాచారం.
వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత, ప్రజా వ్యతిరేక విధానాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. అనంతరం టీడీపీ-జనసేన పొత్తుపై ప్రకటన చేద్దామని నిర్ణయించుకునే వచ్చినట్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. దీనికి చంద్రబాబు.. అప్పుడేనా.. ఇంత హఠాత్తుగానా అని ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనికి స్పందనగా పవన్ తాను నిర్ణయం తీసుకున్నానని, మీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగినట్లు సమాచారం. దీనికి చంద్రబాబు లేదని చెప్పడంతే బయటికి వచ్చి పవన్ ప్రకటించేశారు.












Click it and Unblock the Notifications