Railway Fines భారీగా పెంపు. మరింత కఠినంగా రూల్స్! లిస్ట్ ఇదే
రైలు ప్రయాణం చేసేటప్పుడు ' టీటీ వచ్చినప్పుడు చూద్దాంలే.. ఎవరూ చెక్ చేయరులే' అని లైట్ తీసుకుంటే ఇకపై అడ్డంగా బుక్కయిపోవడం ఖాయం. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల క్రమశిక్షణను పెంచడానికి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. 1989 నాటి పాత రైల్వే చట్టాన్ని సవరిస్తూ 'జన విశ్వాస్ (నిబంధనల సవరణ) చట్టం, 2026' ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసే వారికి రైల్వే శాఖ భారీగా షాక్ ఇవ్వనుంది.
ఇప్పటివరకు టికెట్ లేకుండా ప్రయాణించి పట్టుబడితే కనీస జరిమానా కేవలం రూ.250 మాత్రమే ఉండేది. కానీ జూన్ 20, 2026 నుంచి ఈ కనీస ఫైన్‌ను ఏకంగా రూ. 500లకు పెంచేశారు.
కేవలం ఫైన్ మాత్రమే కాదు.. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారో ఆ అసలు ప్రయాణ ఛార్జీతో పాటు ఈ రూ.500 అదనపు పెనాల్టీని కలిపి వసూలు చేస్తారు. ఒకవేళ మీరు ఏ స్టేషన్‌లో ఎక్కారో రైల్వే సిబ్బందికి తెలియకపోతే.. ఆ రైలు ఎక్కడ మొదలైందో అక్కడి నుంచే పూర్తి టికెట్ ధరను లెక్కగట్టి గుంజుతారు. ఒకవేళ ఫైన్ కట్టడానికి మొండికేస్తే.. ఆరు నెలల జైలు శిక్షతో పాటు కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది.

ఆర్‌పీఎఫ్‌కు 'స్పెషల్ పవర్స్'..
ఇంతకుముందు రైల్వే రక్షణ దళానికి (RPF) నేరుగా జరిమానాలు వసూలు చేసే పూర్తి అధికారాలు ఉండేవి కావు. కానీ ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం.. తప్పు చేసిన వారి నుంచి ఆర్‌పీఎఫ్ సిబ్బంది అక్కడికక్కడే ఫైన్ వసూలు చేసి రశీదు ఇచ్చేస్తారు. డబ్బులు కట్టకపోతే పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు పెడతారు.
ఏ తప్పుకు ఎంత జరిమానా? (క్యాష్ రెడీగా ఉంచుకోవాల్సిందే!):
- లేడీస్ కోచ్‌లోకి దూరితే: మహిళల కోసం కేటాయించిన కోచ్‌ల్లోకి పురుషులు ప్రవేశిస్తే ఏకంగా రూ.2,500 ఫైన్.
- రిజర్వేషన్ కోచ్‌లలో దౌర్జన్యం: అక్రమంగా రిజర్వ్డ్ కోచ్‌లోకి ఎక్కితే రూ.2,000.. సీటు ఖాళీ చేయమన్నా వినకపోతే మరో రూ.1,000 అదనం.
- పొగతాగితే పొగబెడతారు: రైళ్లు లేదా రైల్వే ప్రాంగణాల్లో ధూమపానం (స్మోకింగ్) చేస్తే రూ.2,000 జరిమానా.
- డేంజర్ సామాన్లు: అనుమతి లేని ప్రమాదకర వస్తువులు తెస్తే ఏకంగా రూ.10,000 వడ్డిస్తారు.
- ప్లాట్‌ఫామ్స్ పై అనధికారిక ప్రవేశం: టికెట్ లేకుండా రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తే రూ.500.
- సిబ్బందిని అడ్డుకుంటే: రైల్వే ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తే రూ.1,000 నుంచి రూ.2,000 వరకు.
- బెగ్గర్స్ అండ్ అన్‌అథరైజ్డ్ వెండర్స్: పర్మిషన్ లేకుండా తినుబండారాలు అమ్మే వారికి, భిక్షాటన చేసే వారికి రూ.2,000.
నెలకు రూ. 40 కోట్లు వసూలు.. అందుకే ఈ కఠిన నిర్ణయం!
రైల్వే శాఖ ఈ స్థాయిలో కఠినంగా మారడానికి బలమైన కారణమే ఉంది. కేవలం గడిచిన మే నెలలోనే సెంట్రల్ రైల్వే పరిధిలో టికెట్ లేకుండా ప్రయాణించిన దాదాపు 4.96 లక్షల మందిని పట్టుకున్నారు. వారి నుంచి ఏకంగా రూ.40.85 కోట్ల జరిమానా వసూలు చేశారు. ఇంత భారీ సంఖ్యలో ఉల్లంఘనలు జరుగుతుండటంతోనే ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేసింది.
ఇకనైనా ప్రయాణికులు షార్ట్‌కట్‌లు వెతక్కుండా, సరైన టికెట్ కొనుగోలు చేసి నిబంధనల ప్రకారం ప్రయాణించాలని, లేదంటే జేబులు ఖాళీ అవ్వడం ఖాయమని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు.














Click it and Unblock the Notifications