హైదరాబాద్ ను చూస్తే అసూయ.. ఆంధ్రులను కట్టుబట్టలతో పంపారు: లోకేష్ వ్యాఖ్యలపై చర్చ
ఏపీ మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ పైన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధిని చూస్తే తనకు అసూయ కలుగుతోందని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాలలో దుమారంగా మారాయి. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రులను కట్టుబట్టలతో బయటకు పంపించారని ఆ అవమానమే అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించాలనే పట్టుదలకు కారణమైందని లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి.
హైదరాబాద్ అభివృద్ధి చూస్తే అసూయ కలుగుతుందన్న లోకేష్
దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా మంగళగిరి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేశారు. ఈ రైల్వే స్టేషన్ ను ప్రధాన నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ రెండు తెలుగు రాష్ట్రాలను గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 60 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి హైదరాబాదును అభివృద్ధి చేశామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చూస్తే అసూయ కలుగుతుందన్నారు.

ఆ కసి, పట్టుదలతోనే రాజధాని అమరావతి నిర్మాణం
అయితే 2014 రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను కట్టుబట్టలతో బయటకు పంపించారని లోకేష్ పేర్కొన్నారు. ఆ సమయంలో ఎదురైన పరిస్థితులే తమలో ఒక పట్టుదలను, కసిని పెంచాయని లోకేష్ తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఆగిపోయిందని ఆయన ఆరోపించారు. మళ్లీ ప్రస్తుతం ఆ ఏపీ రాజధాని అమరావతిని అంతర్జాతీయంగా గుర్తింపు పొందేలా తీర్చిదిద్దుతామన్నారు.
వచ్చే మూడేళ్ళలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇక్కడే
అమరావతి పనులు వేగవంతం అవుతున్నాయని, రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల యువత ఉద్యోగాల కోసం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తామని అన్నారు. రాష్ట్రంలో యువత ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాల్సిన పని ఉండదని వచ్చే మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు.ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేశారు.
హైదరాబాద్ ను మించిన ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా అమరావతి
హైదరాబాద్ ను మించిన ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దడం తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న లోకేష్ ఆ దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అయితే హైదరాబాద్ ను చూస్తే అసూయ కలుగుతుందని, రాష్ట్ర విభజన రోజు ఆంధ్రులను కట్టుబట్టలతో బయటకు పంపించారని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చకు కారణంగా మారాయి.












Click it and Unblock the Notifications