ఏపీ మీదుగా బెంగళూరుకు బుల్లెట్ రైలు, ఎలైన్‌మెంట్ మార్పు - ఈ ప్రాంతాలకు వరం..!!
బుల్లెట్ రైలు కోసం వేగంగా కసరత్తు జరుగుతోంది. కేంద్రం ప్రకటించిన బుల్లెట్ లైన్ కారిడార్ ఏపీ మీదుగా ఖరారైంది. అయితే, ఏపీ ప్రభుత్వం ఎలైన్‌మెంట్‌లో కీలక మార్పులు ప్రతిపాదించింది. హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్ లో కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వచ్చాయి. వీటిని అమలు చేయటం ద్వారా రాయలసీమ ప్రాంతంలోని ఈ పట్టణాలకు మరో వరంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.
బుల్లెట్ రైళ్ల కార్యాచరణ కేంద్రం వేగవంతం చేసింది. హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్ ఎలైన్‌మెంట్ పైన స్పష్టత వస్తోంది. ఈ సమయంలోనే ఏపీ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన లను సమర్పించింది. ఈ బుల్లెట్ రైలు కారిడార్ ధర్మవరం, పుట్టపర్తి మీదుగా మార్గాన్ని మార్చాలని ఏపీ ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్‌కు సూచించింది. దీంతో ఈ రెండు ప్రాంతాల్లో హైస్పీడ్ రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పుట్టపర్తికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం తాజా ఎలైన్‌మెంట్‌తో అనంతపురం-హిందూపురం మధ్య దూరం 90.7 కి.మీ. నుంచి 102.1 కి.మీ.కు పెరిగినా, మరింత మందికి బుల్లెట్ రైలు సౌకర్యం అందుబాటులోకి రానుడంటంతో ఈ ప్రాంతానికి గేమ్ ఛేంజర్ గా మారే అవకాశం కనిపిస్తోంది.

పుట్టపర్తి మీదుగా బుల్లెట్ రైలు
తాజాగా నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో సమావేశమైన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే, డీపీఆర్ తయారీలో మార్పులు చేయాలని సూచించింది. ఈ మార్పులకు అనుగుణంగా ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం చేయాలని కోరింది. ఈమేరకు రైల్వే బోర్డ్ ఛైర్మన్‌కు సైతం ప్రభుత్వం లేఖరాసింది. పుట్టపర్తి మీదుగా లైన్ మార్పు చేస్తే అక్కడికి వచ్చే భక్తులు సులభంగా హైదరాబాద్, బెంగళూరు కు వెళ్లే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. బుల్లెట్ రైల్ సౌకర్యంతో పుట్టపర్తి, ధర్మవరం ప్రాంతాల ప్రజల ప్రయాణ అవసరాలు తీరడమే కాకుండా, ఈ ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో.. ఏపీ ప్రభుత్వ తాజా ప్రతిపాదనల పైన అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications