విద్యా విప్లవం.. రూ. 600 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మక తెలంగాణా ఎడ్యుకేషన్ హబ్!
తెలంగాణ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణా పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్స్ ను బలోపేతం చేస్తుంది. మరింత విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం వికారాబాద్ జిల్లాలో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టింది.
శరవేగంగా తెలంగాణ ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులు
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని నోయిడా తరహాలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన "తెలంగాణ ఎడ్యుకేషన్ హబ్" నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, మెడికల్, నర్సింగ్, ఇంజనీరింగ్, పశువైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయి.దుద్యాల మండలం హకీంపేట గ్రామంలో సుమారు 248 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూ. 600 కోట్ల వ్యయంతో ఈ మెగా ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

పేద, గ్రామీణ విద్యార్థుల కోసం కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన చదువు
ఈ విద్యా సముదాయంలో పేద, గ్రామీణ విద్యార్థుల కోసం కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన చదువును ఒకే ప్రాంగణంలో ఉచితంగా అందించనున్నారు. ఇందులో రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న "యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్" భవనాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికే పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ ఒకేసారి దాదాపు 2 వేల మంది విద్యార్థులు చదువుకోవచ్చు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించే ప్లాన్
దీనితో పాటు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కళాశాలల నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటికి రూ. 19 కోట్లకు పైగా నిధులు కేటాయించగా, 2027 జూన్ నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి. అలాగే, రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న పశువైద్య (వెటర్నరీ) విభాగం భవనాలు 2028 ఆగస్టు నాటికి పూర్తి కానున్నాయి.
4 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చే మెగా విద్యా ప్రాంగణం
మహిళల ఉన్నత విద్య కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాల (రూ. 6.10 కోట్లు), ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ (రూ. 1.5 కోట్లు) భవనాలు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికే పూర్తి కానున్నాయి. కొడంగల్, దుద్యాల, పరిగి వంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ హబ్ ఎంతగానో దోహదపడనుంది. మొత్తంగా 4 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చే ఈ మెగా విద్యా ప్రాంగణంలో 2027 విద్యాసంవత్సరం నుంచి అధికారికంగా రెగ్యులర్ తరగతులు ప్రారంభం కానున్నాయని అధికారులు వెల్లడించారు.













Click it and Unblock the Notifications