సెలవుపై ఇంటికి వచ్చి భార్యను లేపేసిన ఆర్మీ జవాన్..చివరిలో ట్విస్టు ఇదే..!
పంజాబ్ లోని హోషియార్ పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఆర్మీ జవాన్ తన భార్యను కిరాతకంగా కొట్టి చంపాడు. సెలవుపై ఇంటికి వచ్చిన ఆయన ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు స్పందించి జవాన్ తో పాటు ఆయనకు సహకరించిన మరో ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. హోషియార్ పూర్ జిల్లా హాజీపూర్ నగరంలోని సునేహ్రా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు రమా అనే మహిళగా గుర్తించారు. ఈ ఘటన ఆగస్టు 13 న జరిగినట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. జవాన్ అమర్ జీత్ సింగ్ సెలవుపై ఇంటికి వచ్చి తన భార్య రమాను కిరాతకంగా కొట్టి చంపాడు. అయితే ఇది ప్రమాదంగా చిత్రీకరించేందుకు జవాన్ కొత్త ప్రణాళికను రచించాడు. ఇంటి మేడ పైనుంచి కింద పడిందని రమా కుటుంబానికి జవాన్ అమర్ జీత్ సింగ్ ఫోన్ చేసి తెలిపాడు. తెల్లవారుజామున 4 గంటలకు ఈ మేరకు ఫోన్ చేశాడు. తనను హాజీపూర్ లోని ఆస్పత్రిలో చేర్పించినట్లు పేర్కొన్నాడు. అయితే నిజమేనని భావించిన రమా కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

అయితే రమా శరీరంపై గాయాలను కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆమె మేడపైనుంచి కింద పడలేదని.. దారుణంగా కొట్టి చంపాడని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వారి ఫిర్యాదుతో పోలీసులు అమర్ జీత్ సింగ్ పై కేసు నమోదు చేశారు. అలాగే అతనికి సహకరించిన అంకుల్ కుల్ దీప్ అలియాస్ కుకి, ఆంటీ సోనియాలపైనా కేసు నమోదు చేశారు. పెళ్లి అయినప్పటి నుంచి రమాపై అమర్ జీత్ సింగ్ శారీరకంగా వేధించేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మృతురాలి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇక ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీస్ అధికారులు బాధితురాలి కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్స్ ను రికార్డు చేసి అతనిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే అమర్ జీత్ సింగ్ ను కస్టడీలోకి తీసుకోగా పరారీలో ఉన్న మరో ఇద్దరిని గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications