ప్రత్యేక హోదా ఏమిటి: దాని వల్ల లాభాలేమిటి, తెలిసీ జగన్...
హైదరాబాద్: ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అయితే, ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వవద్దని ఆర్థిక సంఘం చెప్పిందని మోడీ కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది.
ప్రత్యేక హోదా వల్ల ఒనగూరే ప్రయోజనాలను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది. అందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంగీకరించారు. అయితే, చంద్రబాబు కేంద్రానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని జగన్ విమర్శిస్తున్నారు. అందువల్ల ప్రత్యేక హోదా వల్ల ఒనగూరే ప్రయోజనాలేమినే విషయం చర్చనీయాంశంగా మారింది.
Recommended Video


ఇలా అది పురుడు పోసుకుంది...
ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి 1969లో కేంద్ర నిధుల కేటాయింపు, వివిధ రకాల పన్నుల్లో మినహాయింపు వంటి ప్రయోజనాలను చేకూర్చాలని ఐదవ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఆ సిఫార్సును అప్పటి జాతీ అభివృద్ధి మండలి అంగీకరించింది. తొలుత అస్సాం, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. ఆ తర్వాత ఎనిమిది రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లభించింది. ప్రస్తుతం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది.

ప్రత్యేక హోదాకు ఇవి ఉండాలి...
ప్రత్యేక హోదా ఇవ్వడానికి రాష్ట్రానికి ఉండాల్సిన ప్రత్యేక పరిస్థితులను కేంద్రం ప్రభుత్వం చెప్పింది. అవి 1. కొండ ప్రాంతాలు, కఠినమైన భూములు 2. తక్కువ జనసాంద్రత లేదా అధిక గిరిజన జనాభా 3 .పొరుగు దేశాల సరిహద్దు వెంబడి ఉన్న వ్యూహాత్మక ప్రాంతాలు 4. ఆర్థిక, మౌలిక సదుపాయాల్లో వెనుకబాటుతనం 5. స్థిరంగా లేని రాష్ట్ర ఆర్థిక వనరులు. అతి తక్కువ వనరులు ఉండి తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ తమ అభివృద్ధికి ఆదాయ వనరులను సమీకరించుకోలేని స్థితిలో ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వవచ్చు.

ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనాలు ఇవీ..
సాధారణ రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనాలు ఎక్కువగా కలుగుతాయి. ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు కేంద్ర నిధులు 90 శాతం గ్రాంట్లుగాను, 10 శాతం అప్పుగాను వస్తాయి. గ్రాంట్లుగా వచ్చిన మొత్తాలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు.

పన్ను రాయితీలు ఇలా...
ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లోని పరిశ్రమలకు భారీగా రాయితీలు వస్తాయి. వంద శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఉంటుంది. ఆదాయం పన్నులో కూడా వంద శాతం రాయితీ ఉంటుంది. ఈ రాయితీల వల్ల పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారనేది ఉద్దేశం.

హోదాతో లాభం పొందిన రాష్ట్రాలు
ప్రత్యేక హోదా వల్ల ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనికి 2 వేల పరిశ్రమలు వచ్చాయని అంటున్నారు. దానివల్ల ఉపాధి అవకాశాలు 490 శాతం పెరిగాయి. ఆంధ్రప్రదేశ్ కన్నా వెనకబడిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్ల 10 వేల పరిశ్రమలు వచ్చాయి.

నిర్ణయాధికారం ఎవరిది..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే నిర్ణయాధికారం జాతీయ అభివృద్ధి మండలికి ఉంటుంది. ప్రధాని దానికి అధ్యక్షులు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రణాళిక సంఘం సభ్యులు అందులో సభ్యులుగా ఉంటారు. కేంద్రం నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇందులో ప్రణాళిక సంఘం, ఆర్థిక సంఘం జోక్యం కూడా ఉంటుంది.

అది తెలిసీ జగన్
కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదని తెలిసి కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అదే డిమాండ్ పెట్టారు. ఆ విషయం తెలిసి అదే డిమాండ్ పెట్టడంలో అర్థం లేదనే వాదన వినిపిస్తోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇవ్వదని తెలిసి జగన్ ఆ డిమాండును పెట్టకూడదని అనడంలో అర్థం లేదనే చెప్పవచ్చు. రాజీ పడకుంటూ వెళ్లాలనే ఉద్దేశం నుంచి పుట్టిన వాదన అది.












Click it and Unblock the Notifications